బయో మందులు విక్రయిస్తే లైసెన్స్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

బయో మందులు విక్రయిస్తే లైసెన్స్‌ రద్దు

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : రైతులకు బయో మందులు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దుచేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ ట్రేడర్స్‌, జగదీష్‌ ఫర్టిలైజర్స్‌, కల్యాణ్‌ ఫర్టిలైజర్స్‌, శ్రీలక్ష్మి ఫర్టిలైజర్స్‌ దుకాణాలను ఏడీఏ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పురుగు మందుల డీలర్ల దగ్గర ఉన్న స్టాక్‌ వివరాలు, వాటికి సంబంధించి వ్యవసాయ శాఖ జారీ చేసిన అనుమతి పత్రాలు, స్టాక్‌ రికార్డులు, స్టాక్‌ బోర్డు, స్టాక్‌ రిజిస్టర్లు తనిఖీ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలన్నారు. అనుమతిలేని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

ప్రతీ నీటిబొట్టును సంరక్షించుకోవాలి

గార్ల: ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపు కోసం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని డీఎల్‌పీఓ స్వరూప సూచించారు. బుధవారం మండలంలోని సీతంపేట, గార్ల, గోపాలపురం పంచాయతీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలు, వీఓ భవనాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, ప్రతీ నీటి బొట్టును సంరక్షించుకునేందుకు ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా ఉచితంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవచ్చని తెలిపారు. సర్పంచ్‌ గూగులోత్‌ వీర్యానాయక్‌, ఎంపీఓ శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు రమేష్‌, మధునాయుడు తదితరులు పాల్గొన్నారు.

వీరన్న సన్నిధిలో వేలం పాటలు

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ మండపంలో బుధవారం షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు సంబంధించిన గదులు, ఖాళీ స్థలాలు, భక్తుల ఫొటోలు తీసుకునే హక్కు, మరుగుదొడ్ల నిర్వహణ కోసం వేలం పాటలు జరిగినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి తెలిపారు. సీల్డ్‌ టెండర్‌ కమ్‌ బహిరంగ వేలం పాటలు జరిగాయి. పలువురు వ్యాపారులు సీల్డ్‌ టెండర్లను బాక్స్‌లో వేశారు. వేలం పాటల ద్వారా ఆలయానికి రూ.37.62లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. వీరభద్రస్వామి కాంప్లెక్స్‌లోని 28 షాపుల్లో 18 షాపులకు వేలం పాటలు జరగగా.. 10 షాపులకు వాయిదా పడినట్లు తెలిపారు. అలాగే భద్రకాళీ కాంప్లెక్స్‌లోని 19షాపుల్లో 11షాపులకు వేలం పాటలు జరిగాయి. రెండు ఖాళీ స్థలాలు, భక్తులను ఫొటోలు తీసుకునే హక్కు, మరుగుదొడ్ల నిర్వహణ వేలం పాటలు జరిగినట్లు వివరించారు. తూర్పు రాజగోపురం పక్కన ఉన్న ఖాళీ స్థలాలకు వేలం పాటలు జరగలేదు. వేలం పాటలను డివిజన్‌ అధికారి సంజీవరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్‌, చిన్నం గణేష్‌, దొంగల జనార్దన్‌రెడ్డి, కుదురుపాక ఉప్పలయ్య, శక్రునాయక్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జీఈసీఓగా విజయలక్ష్మి బాధ్యతలు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కస్తూర్బాగాంధీ విద్యాలయాల జెండర్‌ ఎడ్యుకేషన్‌ కో ఆర్డినేటర్‌ (జీఈసీఓ)గా విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత జీఈసీఓ గాయత్రి బయ్యారం జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలకు బదిలీపై వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement