ప్రభుత్వ ఆస్పత్రి స్టాఫ్‌ నర్సులపై ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రి స్టాఫ్‌ నర్సులపై ఆరోపణలు

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

‘కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఓ వ్యక్తి మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్ష చేసిన డాక్టర్లు అడ్మిట్‌ కావాలని చెప్పి మందులు రాసి ఇచ్చారు. కాగా, సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో బెడ్‌పైనే మూత్ర విసర్జన చేశాడు. ఇది చూసిన డ్యూటీలో ఉన్న స్టాఫ్‌నర్సు రోగిని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. డాక్టర్‌తో చెప్పి డిశ్చార్జ్‌ చీటీ రాయించి ఇంటికి వెళ్లమని చెప్పారు. అయితే రోగి బంధువులు ఆస్పత్రి ఉన్నతాధికారులకు జరిగిన విషయం తెలపడంతో డిశ్చార్జ్‌ లెటర్‌ వెనక్కి తీసుకొని వైద్యం చేసిన విషయం చర్చగా మారింది.’

సాక్షి, మహబూబాబాద్‌: మారుమూల మానుకోటను జిల్లా కేంద్రంగా మార్చారు. ఇందులో భాగంగానే 50పడకల ప్రభుత్వ ఆస్పత్రిని 300 బెడ్లకు అప్‌గ్రేడ్‌ చేశారు. ఈమేరకు వందలాది మంది డాక్టర్లు, 300పైగా స్టాఫ్‌ నర్సులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రి కావడంతో... మెడికోలు కూడా వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో గతంలో ప్రతీరోజు 500ఓపీ ఉండగా.. ప్రస్తుతం 700 పైగా చేరింది. ఇన్‌ పేషెంట్లు, ప్రసూతి వార్డులు, ఎమర్జెన్సీ, జనరల్‌ వార్డులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కాగా, బెడ్లు, డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, మెడికోలు.. ఇలా అందరి సంఖ్య పెరిగిందని, సర్వీస్‌ మాత్రం తగ్గుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇలా వచ్చి .. అలా వెళ్తున్నారు..

ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ.. సక్రమంగా డ్యూటీలు చేయాల్సిన స్టాఫ్‌ నర్సులు రోగులతోపాటు ట్రెయినీ విద్యార్థులు, ఇతర కింది స్థాయి సిబ్బందిని బెదిరిస్తున్నట్లు ట్రెయినీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమకు నచ్చిన షిఫ్ట్‌లో డ్యూటీ వేయించుకొని ఇలా వచ్చి అలా వెళ్తున్నారని తెలిసింది. పలువురు వరంగల్‌, ఖమ్మం వంటి పట్టణాల నుంచి అప్‌అండ్‌ డౌన్‌ చేయడంతో ౖరైలు టైమ్‌ వారి డ్యూటీ టైమ్‌గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. వారి డ్యూటీలను ఎంపీహెచ్‌ డబ్ల్యూ, ఎంఎల్‌టీ అప్రెంటిష్‌షిప్‌ చేసే వారికి అప్పగించడం.. వారిని బెదిరించడం.. డ్యూటీ సమయానికి ముందుగానే వెళ్లిపోవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శలు ఉన్నాయి. కొందరు ఆస్పత్రి షిఫ్ట్‌ సమయంలో ఇన్‌పంచ్‌ వేసి వెళ్లి.. మళ్లీ డ్యూటీ ముగిసే సమయానికి వచ్చి అవుట్‌పంచ్‌ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్టాఫ్‌నర్సులపై పలువురు రోగులు, వారి బంధువులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరించినా.. కొందరు సిబ్బంది తమ పద్ధతి మార్చుకోవడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు

తమ పని చేయాలని ట్రెయినీ విద్యార్థులకు బెదిరింపులు

ఉన్నతాధికారులు హెచ్చరించినా మారని తీరు

రోగులపై నిర్లక్ష్యం..

ఆస్పత్రికి వచ్చే రోగులకు డాక్టర్‌ చీటీరాసి మందులు, గ్లూకోజ్‌ వంటివి పెట్టాలని స్టాఫ్‌ నర్సులను ఆదేశిస్తారు. కాగా, రోగిని కంటికి రెప్పలా పర్యవేక్షించాల్సిన స్టాఫ్‌ నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ షిఫ్ట్‌లో ఎక్కువ మందికి డ్యూటీలు వేయగా.. ఒకరిద్దరు పనిచేస్తుండగా.. మిగిలినవారు గుంపులు గుంపులుగా ఉండి ముచ్చట్లలో మునిగిపోతున్నారని రోగులు అంటున్నారు. రోగులు ఇబ్బందులు పడినా.. పెట్టిన గ్లూకోజ్‌ ఖాళీ అయినా.. వచ్చి తీసేందుకు కూడా చిరాకు పడుతున్నారు. ఇదేమిటని అడిగిన రోగుల బంధువులతో నిర్లక్ష్యంగా మాట్లాడడం.. కొన్ని సందర్భాల్లో వారిని తిట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం..

పలువురు స్టాఫ్‌ నర్సులు రోగులు, బంధువులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పలువురిని పిలిచి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాం. డాక్టరైనా.. స్టాఫ్‌ నర్సుఅయినా.. కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఎవరైనా రోగులపై సేవాభావంతో మెదలాలి. అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు.

– శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement