పనులు.. ఇంకెన్నాళ్లు! | - | Sakshi
Sakshi News home page

పనులు.. ఇంకెన్నాళ్లు!

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని పత్తిపాక గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేవు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ చదువుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో 2025 మార్చిలో నూతన భవన నిర్మాణానికి ఐటీడీఏ అధికారులు నిధులు మంజూరు చేశారు. అయితే కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇరుకుగదుల్లో నిర్వహణ..

జిల్లా కేంద్రంలోని పత్తిపాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3నుంచి 10వ తరగతి వరకు సుమారు 750మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో సరిపడా గదులు లేక విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఎనిమిది గదులు మాత్రమే ఉన్నాయి. అందులోనే హాస్టల్‌, తరగతులు కొనసాగుతున్నాయి. ఉదయం తరగతులు.. రాత్రిపూట అక్కడే నిద్రించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. వసతి సమస్య వల్ల ఏటా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గుతున్నాయి. 2024 సంవత్సరంలో 900 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 750కి సంఖ్య తగ్గిందని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. కాగా, నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో..

నూతన భవనాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తానని కాంట్రాక్టర్‌ హామీ ఇచ్చినట్లు గిరిజన శాఖ అధికారులు తెలిపారు. కాగా, సదరు కాంట్రాక్టర్‌ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. భవనం పనులు పూర్తయినా.. మరుగుదొడ్లు, విద్యుత్‌ వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, డైనింగ్‌హాల్‌ పనుల్లో జాప్యం జరుగుతుందని వాపోయారు. కాగా ఇప్పటికై నా పెండింగ్‌ పనులు పూర్తి చేసి భవనాన్ని అప్పగించాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై గిరిజన సంక్షేమశాఖ ఏటీడీఓ ఉపేందర్‌ను వివరణ కోరగా కాంట్రాక్టర్‌ పనులు పూర్తి చేసి త్వరలోనే తమకు అప్పగిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అసంపూర్తిగా గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల భవనం

పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌

ఇరుకుగదుల్లో విద్యార్థుల ఇబ్బందులు

పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement