మహబూబాబాద్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు చాలా వరకు తగ్గాయి. ఈమేరకు తాగునీటి సమస్యను అధిగమించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి యాక్షన్‌ప్లాన్ తయారు చేస్తున్నా రు. సమస్య ఉన్న వార్డులను గుర్తించి ప్రత్యామ్నా య మార్గాల ద్వారా నీటి సరఫరా, తదితర అంశాలపై దృష్టి పెట్టారు.
లక్ష జనాభా..
జిల్లాలో మానుకోట, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీలు ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీలోని 36వార్డుల్లో 65,712 మంది ఓటర్లు ఉన్నారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. ఈమేరకు తాగునీటి సమస్యను అధిగమిచేందుకు అధికారులు కొద్దిరోజులుగా యాక్షన్ ప్లాన్‌పై కసరత్తు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో డీఈ, ఇద్దరు ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఫిట్టర్లు, 30మంది లైన్‌మెన్ల ద్వారా నీటి సరఫరా పనులను పర్యవేక్షిస్తున్నారు.
15,393 నల్లా కనెక్షన్లు..
మానుకోట మున్సిపాలిటీలో 168.62 కిలోమీటర్ల పైపులైన్లు, 15,393 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పట్టణానికి ప్రతీరోజు 13.09ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ ఫర్ డే), విలీన గ్రామాలకు 1.91 ఎంఎల్‌డీ నీరు.. మొత్తం 15 ఎంల్‌డీ తాగు నీరు సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నీటితో పాటు మున్నేరువాగులో ఉన్న నీటిని ఫిల్టర్ బెడ్ ద్వారా 9 వార్డులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 27 వార్డులకు మాత్రమే మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు.
వార్డుల గుర్తింపు..
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని 21,22,23,24,25,36వ వార్డుల్లో నీటి సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్ని వివరాలు సేరించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆతర్వాత పాలక మండలి తీర్మానంతో యాక్షన్ ప్లాన్‌పై చర్యలు తీసుకోనున్నారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సూచనలు, సలహాలు కూడా పరిగణనలోకి తీసుకుని ఆతర్వాత ప్లాన్ ఫైనల్ చేస్తారు. బావులకు మోటార్లు, రిపేర్లు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ వసరులపై దృష్టి..
చేతిపంపులు, బోర్లు, బావులతో పాటు మున్నేరు వాగులో ఉన్న నీరు, ఈదులపూసపల్లి చెరువు, ఇతర నీటి వనరులపై అధికారులు దృష్టి సారించారు. గతంలో తీవ్ర తాగునీటి సమస్య తలెత్తిన సందర్భాల్లో తీసుకున్న చర్యలు, ఇతర అంశాలపై దృష్టిలో పెట్టుకుని ప్లాన్‌లో అంశాలను నమోదు చేస్తున్నారు.
మిగితా మున్సిపాలిటీల్లో కూడా..
మానుకోటతో పాటు మరిపెడ, డోర్నకల్, తొర్రూ రు, కేసముద్రం మున్సిపాలిటీల్లో కూడా యాక్షన్ ప్లాన్‌పై కసరత్తు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో కూడా చేతి పంపులు, బావులు, బోర్లతో పాటు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించారు. యాక్షన్ ప్లాన్ చర్యలు చేపట్టనున్నారు.
ప్లాన్ సిద్ధం చేస్తున్నాం..
తాగునీటి సమస్యను అధిగమించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. వార్డుల్లో అన్ని వివరాల సేకరణతో పాటు సమస్య ఉన్న వార్డులను గుర్తించాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ తయారు చేస్తున్నాం. ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టాం. త్వరలో నిర్వహించే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దానిపై నిర్ణయం తీసుకుంటాం.
– ఉపేందర్, ఇన్‌చార్జ్ కమిషనర్, మానుకోట
మున్సిపల్ వార్డుల్లో తాగునీటి వనరుల వివరాల సేకరణ
ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి
మున్నేరు వాగు ద్వారా పలు వార్డులకు తాగునీటి సరఫరా
వనరుల గుర్తింపు..
యాక్షన్ ప్లాన్‌లో భాగంగా వార్డుల్లో ఉన్న నీటి వనరులను గుర్తించారు. మొత్తం 340 చేతి పంపులు ఉండగా.. వాటిలో 290 పనిచేస్తున్నాయి. 50మరమ్మతుల బారిన పడ్డాయి.
69 పవర్ బోర్లలో 59 పని చేస్తుండగా 10 మరమ్మతుల బారిన పడినట్లు అధికారులు తెలిపారు.
61బావుల్లో 34 బావులను ఉపయోగిస్తున్నారు. 27 బావులు వినియోగంలో లేవు.
నాలుగు వాటర్ ట్యాంకులు ఉన్నాయి.


