బయ్యారం: వర్షంతో
అలుగుపారుతున్న బయ్యారం
పెద్దచెరువు
సాక్షి, మహబూబాబాద్ :
వర్షం వస్తుంది, చెరువులు నిండుతాయి. భూగర్భజలాలు సంవృద్ధిగా ఉంటాయని నమ్మకంతో పత్తి, మొక్కజొన్న, వరి పంటలను సాగు చేసిన రైతాంగం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. నీరులేక ఎండిపోతున్న పంటలను చూసిన అన్నదాతలు చేసేది ఏమీ లేక నిస్సాయంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం పోసినట్లు అయింది. మరో పదిరోజుల పాటు పంటలకు ఢోకాలేదని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం..
గత కొద్దిరోజులుగా ఆకాశం మేఘావృతమై.. వెంటనే మబ్బులు తేలిపోతున్నాయి. అయితే శనివా రం ఉదయం మాత్రం ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 455.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇందులో అత్యధికంగా కేసముద్రం మండలంలో 76.3 మిల్లీమీటర్లు, బయ్యారం 41 మిల్లీ మీటర్లు నమోదు కాగా.. అత్యల్పంగా దంతాలపల్లి మండలంలో 18.8 మిల్లీ మీటర్లు నమోదు అయింది. దీంతో ప్రధానంగా ఆకాశ పంటల సాగు ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడ, బయ్యారం, గంగారం ప్రాంతాల రైతులతోపాటు, మైదాన ప్రాంతాల పంటలకు ఈ వర్షం ఊపిరిపోసినట్లయింది.
పంటలపై ఆశలు..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో పంటలు సాగుచేయలేదు. ప్రభుత్వం చెప్పినట్లుగా వరి తగ్గించి ఆరుతడి పంటలు సాగుచేశారు. అయితే వాటికి సరిపడా నీళ్లులేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో మొత్తం 4,56 136 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసే రైతులు ఇ ప్పుడు 3,28,475 ఎకరాల్లో మాత్రమే సాగు చేశా రు. ఇందులో పత్తి 91,916 ఎకరాల్లో సాగుచేయగా.. వరి 1,49,162, మొక్కజొన్న 58, 655, 21,585 ఎకరాల్లో పెసర సాగుచేశారు. అయితే ఇందులో పత్తి, మొక్కజొన్న పంటలు కాత పూత, పాలకంకి పోసింది. వీటికి ఇప్పుడు నీరు అత్యధికంగా కావాలి. లేకపోతే పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ వర్షంతో పత్తి మొదటి క్రాప్ వస్తుందని, మొక్కజొన్నకు మరో పదిరోజుల తర్వాత మరొక వర్షం పడితే చాలని రైతులు చెబుతున్నారు.
కురుస్తున్న వర్షాలతో పంటలకు ఊపిరి
జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 4,56,136 ఎకరాలు
పత్తి (ఎకరాల్లో)
91,916
పెసర (ఎకరాల్లో)
21,585
వరి (ఎకరాల్లో)
1,49,162
మొక్కజొన్న (ఎకరాల్లో)
58,655


