సమన్వయంతోనే వివాదాలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే వివాదాలకు పరిష్కారం

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

సమన్వయంతోనే వివాదాలకు పరిష్కారం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ లోక్‌ అదాలత్‌లో 18,362 కేసులు పరిష్కారం

మహబూబాబాద్‌ రూరల్‌: ఇరుపక్షాల సమన్వయంతోనే వివాదాలు పరిష్కారం అవుతాయని, ప్రజల న్యాయ పీఠంగా లోక్‌ అదాలత్‌ దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయస్థాన సముదాయం ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ శనివారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ ముఖ్యఅతిథిగా హాజరై కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న భారాన్ని తగ్గించడంతో పాటు, కేసులను త్వరగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించే లక్ష్యంతో లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శాలిని షాకెల్లి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ, డీఎస్పీ తిరుపతిరావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నిలిచిన దాంపత్య బంధం

వివాహ బంధంలో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సాయం అందిస్తుంది. అయితే, ఒక కేసులో న్యాయ సాయంతో పాటు మాట సాయం అందించిన సంస్థ ఓ దాంపత్య జీవితాన్ని నిలబెట్టింది లోక్‌ అదాలత్‌. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని జంగవారిగూడేనికి చెందిన నోముల రమణ, శ్రవణ్‌ వివాహం 2014లో జరిగింది. ఆ దంపతులకు కుమారుడు జన్మించిన తర్వాత కలహాలతో విడిపోయారు. దీంతో ఆమె భర్త నుంచి భరణం ఇప్పించడానికి, కేసు దాఖలు చేయడానికి ఉచిత న్యాయవాదిని నియమించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. స్పందించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి మురారీ ప్యానల్‌ న్యాయవాది రాజమణిని న్యాయ సహాయ న్యాయవాదిగా నియమించారు. న్యాయవాది భరణం కేసు కోర్టులో దాఖలు చేయగా విచారణ దశలో ఉన్న సమయంలో శ్రవణ్‌ ఒక ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న న్యాయ సహాయ న్యాయవాది రమణను కష్ట సమయంలో భర్త వద్దకు వెళ్లి సాయపడాలని కౌన్సెలింగ్‌ నిర్వహించింది. దీంతో రమణ పిల్ల వాడితో సహా భర్త వద్దకు చేరుకుంది. సేవలు చేయగా శ్రవణ్‌ త్వరగా కోలుకున్నాడు. తాను భార్యను దూరం చేసుకున్నా, ఆమె కష్ట సమయంలో తనను ఆదుకుందని భావించిన శ్రవణ్‌ బేషరతుగా రమణను తన వివాహ బంధంలోకి ఆహ్వానించాడు. సామరస్య పూర్వకంగా తమ సంసారాన్ని చక్కదిద్దుకున్న జంటను శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ అభినందించారు.

18,362 కేసులు పరిష్కారం

మహబూబాబాద్‌ రూరల్‌/తొర్రూరు: జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు కోర్టుల్లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ సందర్భంగా 25 మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, 11,465 ప్రీలిటిగేషన్‌ కేసులు పరిష్కరించారు. 5 బ్యాంకు లోన్‌ రికవరీ కేసులు పరిష్కరించి రూ.15 లక్షలు వసూలు చేశారు. 6,867 ఈపెట్టీ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రాఫిక్‌ చలాన్ల ద్వారా రూ.32 లక్షలు జరిమానాలు విధించారు. తొర్రూరు స్థానిక జూ నియర్‌ సివిల్‌ కోర్టులో నిర్వహించిన లోక్‌ అదా లత్‌లో 1,956 కేసులు పరిష్కరించారు. మొత్తం 18,362 కేసులను పరిష్కరించగా మోటారు వాహన ప్రమాద బీమా కేసుల్లో రూ.1.17 కోట్ల నష్ట పరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్సు కంపెనీల ద్వారా అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement