● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్: ప్రజాకవి కాళోజీ.. ప్రజాగొంతుకని, అన్యాయాన్ని ప్రశ్నించిన ఆయన కలం నేటి తరానికి కూడా స్ఫూర్తి అని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూ పరిపాలన భవనం ప్రాంగణంలో నిర్వహించిన కాళోజీ నారాయణ రావు జయంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాళోజీ వ్యక్తి కాదని, ప్రజాశక్తి అన్నారు. సామాజిక చైతన్యం రగిలించారన్నారు. కాళోజీ ఆలోచనలు, సిద్ధాంతాలు కేవలం తెలంగాణలోని ఓరుగల్లు ప్రాంతానికే పరిమితం కాలేదని, ఆయన రచనలు ప్రజల వాణిగా నిలిచా యని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కాళోజీ రచనలు, ఆలోచనలు స్ఫూర్తినిచ్చాయన్నారు. తొలుత కాళోజీనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ బి. వెంకట్రాంరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్, డాక్టర్ చిర్రరాజు, ఆచార్యులు పి. మల్లారెడ్డి, జి. హనుమంతు, డాక్టర్ సోమయ్య, డాక్టర్ సదాశివ్, డాక్టర్ మామిడి లింగయ్య పాల్గొన్నారు.


