సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన క్రీడా నిధులను ఆయా పాఠశాలలు సద్వినియోగం చేసుకోవాలి. పరికరాలు కొనుగోలు చేసి పలు క్రీడల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి.
– మందుల శ్రీరాములు, ఇన్‌చార్జ్ డీఈఓ
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకు ఖేలో ఇండియా క్రీడా నిధులు రూ.59.10లక్షలు విడుదల చేశాయి. ఈ నిధులు నేరుగా పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాలో జమ అవుతాయి. ఈ నిధులతో క్రీడా పరికరాలు మాత్రమే కొనుగోలు చేయాలనే ఆదేశాలున్నాయి. ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున జమ అవుతా యి. రానున్న రోజుల్లో విద్యార్థులు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి.
జిల్లాకు రూ.59.10లక్షలు..
జిల్లాలో మొత్తం 742 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. రూ.59.10లక్షల నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని 360 ప్రాథమిక పాఠశాలలకు రూ.18 లక్షలు, 101 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.19.10 లక్షలు, 96 ఉన్నత పాఠశాలలకు రూ.24 లక్షలు వచ్చాయి. 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.2.25 లక్షలు, మోడల్, కేజీబీవీ స్కూల్, కళాశాలలకు రూ.4.75లక్షలు వచ్చాయి. అదేవిధంగా గ్రౌండ్ లేని 56 ప్రాథమిక పాఠశాలలకు రూ.4 వేల చొప్పున రూ.2.24లక్షలు, 13 ప్రాథమిక పాఠశాలలకు రూ.7,000 చొప్పున రూ.91వేలు, 11 ఉన్నత పాఠశాలలకు రూ.1.65లక్షలు, ఒక ప్రభుత్వ కళాశాలకు రూ.19,000 మంజూరయ్యాయి.
742 పాఠశాలలు.. 75 పాఠశాలలకు పీఈటీలు
ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో విద్యార్థుల సమగ్ర వికాసానికి, క్రీడా నైపుణ్యాల పెంపుదలకు ఆటంకం ఏర్పడుతోంది. పలు పాఠశాలల్లో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల మైదానాలు ఉన్నప్పటికీ ఆటలాడించే దిక్కులేక క్రీడా పీరియడ్లు నామమాత్రంగా మారుతున్నాయి. జిల్లాలో 742 పాఠశాలలకు 75 పాఠశాలల్లో మాత్రమే పీఈటీలు ఉండడం గమనార్హం. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్క పీడీ కూడా లేరు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ పీఈటీల రిటైర్మెంట్‌కు అనుగుణంగా కొత్త నియామకాలు జరగకపోవడం, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను కేటాయించడం వల్ల చాలా హైస్కూళ్లలో పీఈటీ పోస్టులు రద్దవుతున్నాయి లేదా ఇతర స్కూళ్లకు బదిలీ అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఖాళీలను భర్తీ చేయకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడారంగం మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.
ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు..
ప్రాథమికోన్నత, హైస్కూళ్లకు
రూ.10 వేలు
జిల్లాకు రూ.59.10లక్షలు మంజూరు


