నోటీసులకు స్పందించండి..
కలెక్టర్ స్నేహ శబరీష్
సాక్షి, మహబూబాబాద్: ప్రజాస్వామ్య దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు తప్పనిసరి. ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతా లు, లింగ బేధాలకు అతీతంగా ఓటు హక్కు ఉంటుంది. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటే ఆయుధం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓటుకు కావాల్సిన అర్హత ఉంటే దానికి భద్రత కల్పించి..స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఓటు హక్కు పొందడానికి కా వాల్సిన అర్హత మీకుంటే.. ఓటు చేర్పులు, మార్పులు, సవరణలో పోకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వానిది అని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ‘సాక్షి’తో మాట్లాడారు.
సాక్షి: జిల్లాలో ఓటరు సవరణ ప్రక్రియ ఎలా సాగుతోంది..?
కలెక్టర్: మూడు నెలల క్రితం ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలో ముందు వరుసలో ఉంది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మొత్తం 4,94,935 మంది ఓటర్లు ఉన్నారు. వారందరినీ మ్యాపింగ్ చేశాం. అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశాం. అయితే ఇందులో చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయినవారు, రెండు చోట్ల ఓట్లు ఉండి ఒకే చోటుకు అప్షన్ ఇచ్చిన వారు మొత్తం 47,979 మంది ఓటర్లను తొలిగించాం. అయితే పొరపాట్లు, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పలు తేడాలు ఉన్న 80వేల మంది ఓటర్ల ఓటును సరిచేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నాం.
సాక్షి: జిల్లాలో మీరు జారీ చేస్తున్న నోటీసులకు సరైన స్పందన రావడం లేదని ప్రచారం.. చిన్న చిన్న పొరపాట్లకు కూడా ఓట్లు తొలగించారని చెబుతున్నారు. ఇది నిజమేనా..?
కలెక్టర్: మొత్తం 10 అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని సరిచేసేందుకు నోటీసులు ఇస్తున్నాం. 80,903 నోటీసులు సిద్ధం చేశాం. ఇందులో ఇప్పటివరకు 71,201 మందికి నోటీసులు జారీ చేశాం. ఇందులో 34వేల మంది ఓటర్ల వివరణ తీసుకున్నాం. వారి వద్ద ఉన్న ఆధారాలతో ఓటును సరిచేశాం. మిగిలిన 25వేల మంది హియరింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. మరో 9,671 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. చిన్నచిన్న తప్పులకు ఓటును తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారం జరుగుతోంది. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని ప్రచారం చేసే మేము ఓటును ఎందుకు తొలిగిస్తాం.. వాటిని సరిచేసేందుకే నోటీసులు ఇస్తున్నాం. వివరణ తీసుకొని సరిచేస్తున్నాం.
సాక్షి: నోటీసుల్లో ఏయే అంశాలకు సంబంధించిన పొరపాట్లు ఉన్నాయి..? వాటి సవరణకు ఏం చేయాలి..?
కలెక్టర్: సవరణ జాబితాలో ఉన్న ఓటర్లలో మొత్తం 10 రకాలుగా విభజించి ఆయా అంశాల్లో తప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో తల్లిదండ్రులు–సంతానం మధ్య వయసు తేడా 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండడం అంటే తల్లిదండ్రులు బిడ్డలకు మధ్య కనీసం 15సంవత్సరాల తేడా లేకుండా ఉండడంతో సవరణ జాబితాలో చేర్చారు. ఓటరు వయసు తల్లిదండ్రుల వయసు మధ్య 50 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండడం, ప్రస్తుత ఓటరు జాబితా, గత జాబితాలో తండ్రి పేరు వేర్వేరుగా ఉండడం, దంపతుల ఇద్దరు సంతానాల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉండడం, తండ్రిగా పేర్కొన్న వ్యక్తి పేరుతో సంతానం ఆరుగురి కన్నా ఎక్కువగా ఉండడం, అదే విధంగా ఓటరు మ్యాపింగ్ చేసిన తల్లిదండ్రుల ఓట్లు చెల్లని జాబితాలో ఉండడంతో వారి సంతానం ఓట్లు మారే అవకాశం ఉందని సవరణ జాబితాలో చేర్చారు. ప్రస్తుత ఓటరు జాబితా, గతంలోని ఓటరు జాబితాతో పోల్చినప్పుడు పేర్లు వేర్వేరుగా ఉండడం.. వీటిని సవరించుకునేందుకు 1987కు ముందు పుట్టి ఉంటే ఆధార్ కార్డుతోపాటు 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక చూపిస్తే సరిపోతుంది. 1987–2004 మధ్య పుట్టి ఉంటే మీ గుర్తింపు కార్డుతోపాటు తల్లి, లేదా తండ్రి ఒకరి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. 2004 తర్వాత పుట్టి ఉంటే తల్లి, తండ్రి ఇద్దరి వివరాలతో కూడిన ఆధారాలు చూపిస్తే సరిపోతుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు, అందుబాటులో లేని వారు ఉంటే వారి కుటుంబ సభ్యుల ద్వారా వివరణ తీసుకొని సరిచేస్తున్నాం.
సాక్షి: ఓట్లను తగ్గించేందుకే సవరణ ప్రక్రియ చేపడుతున్నారని ప్రచారం జరుగుతోంది..? మీరేమంటారు..? రాజకీయ పార్టీల మద్దతు ఎలా ఉంది..?
కలెక్టర్: సవరణ ప్రక్రియ అంటే అర్థం కాని వాళ్లు చేసే ప్రచారం. తప్పులు సరిచేయడం, ఒకే వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనే నిబంధన మేరకే సవరణ జరుగుతుంది. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా పోదు.. అయితే నోటీసులకు స్పందించాలి. వివరణ ఇవ్వాలి. జిల్లాలో రాజకీయ పార్టీల నుంచి మంచి మద్దతు వస్తుంది. ఈ ప్రక్రియ మొదలైన నాటి నుంచి పలుమార్లు రాజకీయ పార్టీలతో సమీక్షలు నిర్వహించాం. వారు ఇచ్చే సూచనలు, సలహాలు, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతున్నాం. నోటీసులు తీసుకున్నవారి వద్ద సరైన ఆధారాలు లేకపోతే నివాసం, ఇతర ధ్రువీకరణ పత్రాలు కొత్తగా తీసుకోవచ్చని చెప్పాం. ఈ విషయం అన్ని మండలాల తహసీల్దార్లకు తెలిపాం. సర్ ప్రక్రియ కోసం వచ్చిన దరఖాస్తులకు వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించాం. అదే విధంగా 2026 అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఫాం–6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే కొత్తగా ఓటు హక్కు వస్తుంది. పోలింగ్ స్టేషన్ మార్పు, తప్పులు సరిచేయడం కోసం ఫాం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరగా ఓటర్లందరికీ చేసే విన్నపం ఒక్కటే వయోజనులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలి. ఇందుకోసం మేం అందజేసే నోటీసులు తీసుకొని స్థానిక గ్రామ పంచాయతీ, వార్డు కేంద్రాల్లో ఉన్న అధికారులను కలవండి. మీ వద్ద ఉన్న ఆధారాలు చూపించండి.. మీ ఓటును సరిచేసుకోండి.. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులవ్వండి.
పకడ్బందీగా ఓటరు సవరణ ప్రక్రియ
అర్హత ఉన్నవారి ఓటు పోదు
నోటీసులకు స్పందించి సమాధానం ఇవ్వాలి
ఎస్‌ఐఆర్‌పై రాజకీయ పార్టీలతో సమీక్షలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ స్నేహ శబరీష్


