మరిపెడ రూరల్: మరిపెడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ కోర్టు నేడు(శనివారం) ప్రారంభం కానుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. కోర్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ పరిశీలించారు.
16 ఏళ్ల నిరీక్షణకు తెర..
మరిపెడలో సివిల్ కోర్టు ఏర్పాటు కావడంతో స్థానిక ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరింది. ఇప్పటివరకు సివిల్ వివాదాలు, ఇతర న్యాయపరమైన వ్యవహారాల కోసం సమీపంలోని తొర్రూరు, మహబూబాబాద్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇకపై మరిపెడలోనే కోర్టు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ భారం, సమయం, ఖర్చులు తగ్గనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
గెజిట్ అధికార పరిధి..
తెలంగాణ హైకోర్టు న్యాయ నోటిఫికేషన్ మేరకు మరిపెడలో కోర్టు ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఏప్రిల్ 17న విడుదలైంది. గెజిట్‌లో కోర్టు ఏర్పాటు, స్థానం, స్థానిక అధికార పరిధికి సంబంధించిన వివరాలు పేర్కొన్నారు. కాగా, మరిపెడ కోర్టులో మరిపెడ, నర్సింహులపేట, సీరోలు, చిన్నగూడూరు మండలాల ప్రజలకు న్యాయ సేవలు అందనున్నాయి.
ముఖ్య అతిథులు వీరే..
కోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డితో కలిసి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, తొర్రూ రు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ చేతుల మీదుగా కోర్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు, జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా జడ్జి కె.మురళీమోహన్, తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్యక్షుడు వి.వెంకటరత్నం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ లింగాల శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు బానోతు లాలునాయక్, సైదులు, తేజావత్ శారదరవీందర్ నాయక్, భూక్య శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, మామిడాల మునేష్, చందు, స్థానిక సీఐ పవన్ కుమార్, ఎస్సీ గండ్రాతి సతీష్, రెవెన్యూ, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు మరిపెడలో సివిల్ కోర్టు ప్రారంభం
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి


