సాక్షి, మహబూబాబాద్: ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం వెయ్యిరోజులుగా ప్రజలు మెచ్చేలా పాలన అందిస్తూ ప్రజాశీస్సులతో ముందుకెళ్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రునాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. సైనికుల వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు.
పేదలకు పెద్ద చదువులు
పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు దూరం కావొద్దనే ఆలోచనతో ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. విద్యా విధానంలో మార్పులు చేస్తూ నెల్లికుదురు, నర్సింహులపేట గ్రామాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ద్వారా తెలంగాణ మట్టిబిడ్డలను అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన జరిపే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు.
పేదల చెంతకు పథకాలు
ప్రజలకు ఏది అవసరమో గ్రహించి వారి ఇంటి ముంగిటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మొదటి దశలో 10,651 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. రెండో దశలో 4వేల ఇళ్లు మంజూరు చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. గుడిసెలు లేని రాష్ట్రం లక్ష్యంగా పూరి గుడిసె ఉన్నవారికి పక్కా ఇల్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం, ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంపు వంటి పథకాలతో ప్రజాప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తుందని తెలిపారు. ప్రతీ పథకం పేదలకు ఉపయోగపడేలా రూపొందించామని అన్నారు. వెయ్యిరోజుల పాలనలో మద్దతుగా నిలిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా, అన్ని వర్గాల ప్రజలకు రాంచందర్‌నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహా శబరీష్, ఎస్పీ శబరీష్, డీఎఫ్‌ఓ లావణ్య, అదనపు కలెక్టర్లు అనిల్‌కుమార్, పురుషోత్తం, ఆర్డీఓ నాగలక్ష్మి, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల ముంగిటికి సంక్షేమ పథకాలు
నారాయణపురం రైతుల్లో చిరునవ్వులు
పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు
ప్రజాపాలన దినోత్సవంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్
ఆనందంలో నారాయణపురం రైతులు
తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన డివిజన్లతో రెవెన్యూ రికార్డుల్లో చోటు చేసుకున్న పొరపాటు కారణంగా నారాయణపురం రైతులు పది సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డారని విప్ అన్నారు. వారి సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రీ సర్వే నిర్వహించి 780 మంది రైతులకు 1,468.15 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించామని అన్నారు. రైతులు సారం తెలిసి సాగుచేయాలని భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా అందచేస్తూ రైతుల కష్టసుఖాల్లో ప్రభుత్వం పాలుపంచుకుంటుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లాలో 17 క్లస్టర్లు ఏర్పాటు చేసి 2,125 మంది రైతులకు శిక్షణ ఇచ్చి అధునాత పద్ధతిలో సాగు చేసేలా ప్రోత్సహించామని చెప్పారు. మిషన్ వైవిద్య కార్యక్రమం ద్వారా ఆరుతడి పంటలైన పెసర 21వేల ఎకరాల్లో, 2,600 ఎకరాల్లో కంది సాగుచేసేలా రైతులను ప్రోత్సహించామని చెప్పారు.


