● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : ప్రజాస్వామ్య పాలనలో ప్రజల సంక్షేమం, పారదర్శకత, జవాబుదారీతనం ఎంతో కీలకమని ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శబరీష్ గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలోనే కొనసాగిందని గుర్తు చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలిసిందని వివరించారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి పారదర్శకంగా అందేలా ప్రజాపాలన వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ పోలీసుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.


