● ఉపాధ్యాయుడి కోసం రోడ్డెక్కిన
విద్యార్థినులు
బయ్యారం: పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషల్ టీచర్ పోస్ట్‌ను భర్తీ చేయాలని గురువారం బయ్యారం బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు గాంధీసెంటర్‌లో ఆందోళన చేపట్టారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా తమకు సోషల్ టీచర్ ఏర్పాటు చేయకపోవడంతో చదువుకోలేక ఇబ్బందిపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల ఆందోళన వద్దకు వచ్చిన ఎంఈఓ లక్ష్మణ్‌రావు త్వరలోనే టీచర్‌ను నియమించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే విద్యార్థినుల ఆందోళనతో బాలుర ఉన్నత పాఠశాలలో అదనంగా ఉన్న సోషల్ ఉపాధ్యాయుడిని ఎంఈఓ గురువారం బాలికోన్నత పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు.
దరఖాస్తు గడువు
పొడిగింపు
మహబూబాబాద్ అర్బన్: బీసీ మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుట్టుమిషన్ల దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సాయిశ్రీజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
జాతీయ ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌కు గంగారం కళాకారుడు
గంగారం : బీహార్ రాష్ట్రంలోని శివాన్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జాతీయ స్థాయి ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌కు మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు చుంచ కుమారస్వామికి ఆహ్వానం లభించింది. జాతీయ స్థాయి తక్షశిల కలెక్టివ్ సంస్థ నిర్వహించే ఈ ప్రదర్శనలో పాల్గొనే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన కళాకృతులను జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు కుమారస్వామి గురువారం బీహార్‌కు వెళ్లారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానం
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు గులాబీ రంగు పూశారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆ రంగును తుడిచేసి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ రంగు పూసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పెద్దచెరువును సందర్శించిన భద్రతా నిపుణులు
బయ్యారం: మండలంలోని బయ్యారం పెద్దచెరువును గురువారం సమగ్ర ఆనకట్ట భద్రతా మూల్యాంకణ నిపుణుల బృందం సందర్శించింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు మాజీ చైర్మన్ శైలేష్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు బయ్యారం పెద్దచెరువు తూములు, అలుగులను గురువారం పరిశీలించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సూచనలు చేశారు. ఈ బృందంలో సీడబ్ల్యూపీఆర్‌ఎస్ చీఫ్ రిసెర్చ్ ఆఫీసర్ బి.మురళీధర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వర్‌చౌదరి, ఇరిగేషన్ ఈఈ వెంకట్రామ్, డీఈ నాగార్జునసాగర్, ఏఈఈలు అఖిల, శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.


