● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పూరిగుడిసెలో ఉన్న వారి వివరాలు సేకరించాలన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ఉద్యోగులు కూడా బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతోపాటు హెల్మెట్ ధరించాలన్నారు. 22 మంది హౌజింగ్ అధికారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
చిత్తడి నేలల పరిరక్షణకు చర్యలు
జిల్లాలోని చిత్తడి నేలలు, చెరువులు, ఇతర జలాశయాల పరిక్షణ సమర్థవంతమైన నిర్వహణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. చిత్తడి నేలల సర్వే స్పష్టంగా చేసి సరిహద్దులు పెట్టాలన్నారు. ఆక్రమణలకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. చిత్తడి నేలల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, హౌజింగ్ డీఈ అబ్దుల్ హకీమ్, రాజన్న పాల్గొన్నారు.


