ఇనుగుర్తి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మాలోత్ రాములునాయక్ మరో అరుదైన గౌరవం పొందనున్నారు. 1998 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ)లో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విస్ట్ సర్వీసెస్’(రాష్ట్రపతి పోలీస్ పతకం)కు ఎంపికయ్యారు. కాగా, 2014లో ఆయన ‘పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్’ అందుకున్నారు.
ఉత్తమ అధికారులకు అవార్డులు
మహబూబాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్, కలెక్టర్ స్నేహశబరీష్, ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు డీపీఆర్‌ఓ పసునూరి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న ఉద్యోగుస్తులందరూ సకాలంలో హాజరై ప్రశంస పత్రాలు అందుకోవాలని కోరారు.
న్యాయవాదులపై దాడులను అరికట్టాలి
తొర్రూరు: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరత్నం డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్‌లో న్యాయవాదిపై దాడిని వ్యతి రేకిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. వెంకటరత్నం మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలిపారు. దాడికి పాల్పడ్డ వారి తరఫున న్యాయవాదులు వాదించకుండా సహకరించాలన్నారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు నాగేశ్వర్, కోశాధికారి ఉమావతి, న్యాయవాదులు రఘురాంరెడ్డి, వల్లపు మధుసూదన్, ప్రవీణ్‌రాజు, వెంకన్న, శ్రీధర్, రామకృష్ణ, విజయ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు పార్కులు అందుబాటులో ఉండాలి
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని పార్కులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. మరిపెడలోని పార్కులో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కుల కోసం ప్రభుత్వం వెచ్చించిన నిధులను వాటికే ఖర్చు చేయాలన్నారు. పార్కులో చిన్నారుల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని, వాకర్స్‌కు కావల్సిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీతరవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు గంట్ల గౌతంరెడ్డి, గుగులోతు నీలాలచ్చిరాం, రాము తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి విద్యను బలోపేతం చేయడంలో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల పాత్ర కీలకమని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో శుక్రవారం ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడాలి. ప్రీప్రైమరీ స్థాయి నుంచే చిన్నారుల్లో విద్యపై ఆసక్తి పెంపొందించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఏఎంఓ వెంకటేశ్వర్లు, సీఎంఓ సురేష్, ఏఎస్‌ఓ సంతోష్‌కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు పాల్గొన్నారు.


