● కలెక్టర్ స్నేహ శబరీష్
దంతాలపల్లి: సర్వేలో భూమి సరిహద్దులు సక్రమంగా నిర్ణయించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దముప్పారం, కాలువపల్లి గ్రామాల మధ్య నిర్వహిస్తున్న భూసర్వేను కలెక్టర్ మూడు కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 30,31,32,33 సర్వే నంబర్లలోని 21 మంది రైతులకు ఇంతకుముందే నోటీసులు జారీ చేశామన్నారు. ఆ భూములను క్షుణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పరిశీలన అనంతరం భూముల పాత హద్దుల ప్రకారం హద్దులు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. రైతుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా పారదర్శకంగా సర్వే చేపట్టాల ని అధికారులకు సూచించారు.
గర్భిణులకు పరీక్షలు తప్పనిసరి..
గర్భిణులకు ప్రతీనెల పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపర్చాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. పెద్దముప్పారం గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యంతో పాటు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో సుఖ ప్రసవాల సంఖ్య పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ కందిమళ్ల భరత్‌బాబు, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, తొర్రూరు ఆర్డీఓ గణేష్, తహసీల్దార్ సునీల్‌కుమార్, ఎంపీడీఓ సక్రీయ నాయక్, వైద్యాధికారులు కవిత, వాణి, డీపీఓ నిలోహన్, వివిధ ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


