మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కేజీబీవీని ఎమ్మెల్యే మురళీనాయక్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎల్‌నినో వల్ల వాతవారణంలో చోటుచేసుకునే మార్పులు, ఉష్ణోగ్రతలు పెరగడం, చెట్లను నరకడం వల్ల వర్షపాతంపై పడే ప్రభావం తదితర అంశాలపై పదో తరగతి విద్యార్థినులకు ఎమ్మెల్యే బోధించారు. అనంతరం పాఠశాల ఆవరణ, వంట గదులు, తాగునీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థినులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలను చదవడంతో పాటు వాటి వెనుక ఉన్న విషయాలను అర్థం చేసుకోవాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తాను సొంతంగా రూ.5వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థినులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లు నర్ర సంధ్య శ్రావణ్, నిమ్మల మాధవి శ్రీను, పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ దుర్గలక్ష్మి, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


