● శుక్రవారం నుంచి వేడుక ప్రారంభం
● ఉత్సాహంగా పాల్గొంటున్న
గిరిజన యువతులు
మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా తీజ్ వేడుకలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందిన రోజుకు గుర్తుగా తీజ్ నిర్వహిస్తారని ఇతీహాసం చెబుతుంది. తండాల్లోని యువతులు గోర్ బంజారాలు శ్రీసేవాలాల్ మహారాజ్, దండి మేరామ యాడీలను దైవ దూతలుగా కొలుస్తూ పంటలు బాగా పండాలని, భవిష్యత్ ఆనందంగా సాగాలని కోరుతూ తీజ్ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ.
తొమ్మిది రోజుల పండుగ..
తీజ్ నారు వలే తమ భావి జీవితాలు కూడా అభివృద్ధి చెందాలని, సేవాలాల్ మహారాజ్, మేరామ యాడీలను కొలుస్తూ యవతులు ఆషాడ / శ్రావణ మాసాల్లో తొమ్మిది రోజులు నిర్వహించే పండగే తీజ్. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వివాహితులు తమ భర్తల నుంచి ప్రేమను పొందడానికి తీజ్ నిర్వహిస్తారు.
మొదటి రోజు..
తండా యువకుల సాయంతో పూజారి(నాయక్) క ర్ర సామగ్రి, రంగుల వస్త్రాలతో మంచెను తయా రు చేసిన అలంకరిస్తారు. మహిళలు పాటలు పాడుతుండగా ముందురోజు నానబెట్టిన గోధుమలను యువతులు బుట్టలో అలుకుతారు. తండా పెద్దల సమక్షంలో బుట్టలను మంచైపె పెడతారు.
రెండో రోజు..
యువతీ యువకులు దగ్గరలోని చేలలో బోరడీ ఆటను ఆడుకుంటారు. నాన బెట్టిన శనగలను అమ్మాయిలు పాటలు పాడుతూ రేగు చెట్టు ముళ్లకు గుచ్చుతున్న సమయంలో తండా యువకులు కర్రతో చెట్టును కదలిస్తారు. కదిలే చెట్టు ముళ్లకు శనగలను గుచ్చలేక వారి బాధను పాటల రూపంలో వర్ణిస్తూ యువకులను ఒప్పించి శనగలను రేగు ముళ్లకు గుచ్చి ఆటను ముగిస్తారు.
ఏడో రోజు..
తీజ్ పండుగలో ఏడోరోజు కీలకం. ఏడో రోజు ఢమోళి అనే పూజలో పూజారి సేవాలాల్ మహారా జ్‌కు చూర్మో ముద్దలతో భోగ్ రూపేణా సమర్పించిన అనంతరం సామూహిక మొక్కు చెల్లిస్తారు.
తొమ్మిదో రోజు..
తీజ్ చివరి రోజున ‘కడావ్’ పూజ తర్వాత తీజ్ నిమజ్జనంతో వేడుక ముగుస్తుంది. సేవాలాల్ మహరాజ్‌కు తీపి పదార్థాన్ని నైవేధ్యంగా సమర్పిస్తారు. తీజ్ నిర్వహించే అమ్మాయిలు తొమ్మిది రోజులు నిష్టతో ఉండి కేవలం శాఖాహారాన్నే భుజిస్తారు. తీజ్ చివరి రోజు సాయంత్రం మాత్రమే మేరామ మాత(యాడి) పూజను పొట్టేళ్ల బలితో మాంసాహారం ఉంటుంది.
రాష్ట్ర పండుగగా గుర్తించాలి
వేర్వేరు తండాల్లో వేర్వేరు తేదీల్లో కాకుండా గిరిజనులంతా ఒకేసారి నిర్వహించడం ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించి లంబాడీల తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలి. ఢమోళీ తీజ్ పూజ రోజు సెలవు ప్రకటించాలి.
– గుగులోత్ నందులాల్ నాయక్,
జిల్లా అధ్యక్షుడు, సేవాలాల్ సేన


