● గ్రామ పోలీసు అధికారులతో సేవలు సులభతం
● సురక్షిత సమాజ నిర్మాణానికి కృషి
మహబూబాబాద్ రూరల్: గ్రామస్థాయిలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి గ్రామ పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేస్తూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడం వంటి అంశాల్లో వీపీఓలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను సురక్షితంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ వీపీఓలు అందరి మన్ననలు పొందుతున్నారు.
వారి విధులు..
గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి రవాణా, విక్రయాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ మద్యం తయారీ, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం సేకరించి వెంటనే స్థానిక పోలీసులకు అందిస్తున్నారు. నేరాల నియంత్రణ, రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, డిజిటల్ అరెస్టు, కస్టమర్ కేర్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. ప్రతీ గ్రామానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులను వీపీఓలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా పోలీసు శాఖ జారీ చేసే సూచనలు, సైబర్ నేరాల హెచ్చరికలు, మహిళలు, చిన్నారుల భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రభుత్వ సూచనలు, ప్రజా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే ప్రజలకు చేరవేస్తున్నారు.
సందేహాల నివృత్తి..
గ్రామస్తులకు ఏమైనా సందేహాలు, సమస్యలు లేదా పోలీసు శాఖకు సంబంధించిన సమాచారం అవసరమైనప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా వీపీఓలు వెంటనే స్పందించి సరైన అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు చేరవేసి సత్వర చర్యలు తీసుకునేలా వారధిగా వ్యవహరిస్తున్నారు. ప్రజా భద్రత, చట్టాలపై అవగాహన, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ బాధ్యతాయుత పౌరస్ఫూర్తిని పెంపొందిస్తున్నారు.
ప్రజల సహకారంతో సురక్షిత సమాజ నిర్మాణం
గ్రామస్తుల సహకారంతోనే నేరరహిత, ప్రశాంత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. గ్రామాలను సురక్షితంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. గ్రామ స్థాయిలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి గ్రామ పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేస్తూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడం వంటి అంశాల్లో వీపీఓలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
– డాక్టర్ పి.శబరీష్, ఎస్పీ
ప్రత్యేకించి యువత చెడు వ్యసనాలు, గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర సామాజిక దురాచారాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సాధన, స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని ప్రోత్సహిస్తున్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో శ్రమిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని యువతకు స్ఫూర్తినిస్తున్నారు.
జిల్లాలోని ఓ గ్రామంలో స్థానికులతో మాట్లాడుతున్న వీపీఓ(ఫైల్)


