● ఎస్పీ శబరీష్
నెహ్రూసెంటర్: సైబర్ నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతీ ఉద్యోగికి సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని ఎస్పీ శబరీష్ అన్నారు. ‘సురక్షా కా తిరంగా–సైబర్ స్వాతంత్య్ర తెలంగాణ’ అనే సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యార్థులు, అధ్యాపకులతో సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించిన అనంతరం డిజిటల్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ముఖచిత్రాలు, ఆడియోలు, వీడియోలు సృష్టించి ఉన్నతాధికారులు, స్నేహితులు, అధికా రుల పేరుతో వచ్చే కాల్స్, సందేశాలను నమ్మొద్దని సూచించారు. సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ ద్వారా అత్యవసర డబ్బు పంపాలని వచ్చే సందేశాలను నమ్మి మోసపోతున్నారని, భవిష్యత్‌లో ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రతీ అధికారి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకుని తమ ఉద్యోగులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాల్లో 30 శాతం ఇన్వెస్ట్‌మెంట్ మోసాలే ఉన్నాయని, పదవీ విరమణ ఉద్యోగులు, ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన వారినే టార్గెట్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే సంబంధిత బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లపై చర్యలు తీసుకుని నేరగాళ్లను గుర్తించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సైబర్ భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతీపౌరుడి బాధ్యతని, అప్రమత్తతే సైబర్ మోసాలకు నివారణ అని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైబర్‌సెల్ ఇన్‌స్పెక్టర్ నరేష్, జీఎంసీ ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


