న్యూస్‌రీల్
చనిపోయిన వారి పేరిట నొక్కేసిన బినామీలు
● ప్రతీ నెల రూ.75 లక్షలకు పైగా పక్కదారి
● ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 2,702,
మున్సిపాలిటీల్లో 1,201 పింఛన్ల తొలగింపు
జిల్లాలో పింఛన్ల వివరాలు
సాక్షి, మహబూబాబాద్ : వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం ఆసరాగా ఉండేందుకు అందించే పింఛన్లు పక్కదారి పట్టాయి. చనిపోయిన వారితో పాటు నెలల తరబడి అందుబాటులో ఉండకుండా పోయిన వారి పేరిట వచ్చే పింఛన్ డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటున్న వారి గుట్టురట్టు చేయగా తాజాగా మహబూబాబాద్ పట్టణంతోపాటు బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకునేవారిలో బినామీలను గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు మొత్తం కలిపి 3,903 బినామీ పింఛన్లు ఉన్నట్లు అంచనా. వీటి ద్వారా నెలకు రూ.75లక్షలకు పైగా డబ్బులు పక్కదారి పడుతున్నట్లు తెలిసింది.
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో..
చేయూత పింఛన్లలో జరుగుతున్న అవకతవలపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గతేడాది జూలై నెల నుంచి మొఖ గుర్తింపు పద్ధతి (ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా పింఛన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పద్ధతి ద్వారా పింఛన్లు ఇవ్వడం ప్రారంభించారు. అయితే గతేడాది మార్చిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 94,399 మంది పెన్షనర్లు ఉంటే.. ఎఫ్‌ఆర్‌ఎస్ పద్ధతిన పెన్షన్ల పంపిణీ, వరుసగా మూడు నెలలు పెన్షన్‌కు రాకపోతే పేరు తొలగించే ప్రక్రియ చేపట్టారు. దీంతో ఇప్పుడు పెన్షనర్ల సంఖ్య 91,697కు చేరింది. అంటే 2,702 మంది పెన్షనర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో సగం మంది చనిపోయిన వారు ఉంటే మిగిలిన సగం పెన్షన్లు బినామీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
మున్సిపాలిటీల్లో ...
చనిపోయిన వారి పేరున పింఛన్లు డ్రా చేస్తున్న విషయంపై గ్రామీణ ప్రాంతాల్లో నిగ్గుతేల్చిన అధికారులు ఇప్పుడు మున్సిపాలిటీల గుట్టు రట్టు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చనిపోయిన వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు. కానీ పట్టణాల్లో గుర్తించడం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెన్షన్లు బ్యాంకుల ద్వారా అందిస్తున్నారు. ఇలా చేయడం మూలంగా గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన వారి పింఛన్ డబ్బులు కాజేస్తున్నారు. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మండలాల్లో మొత్తం 12,569 మంది పెన్షనర్లు ఉన్నారు. ఇందులో బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకునే వారు 5,603 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరి మొఖ గుర్తింపు తీసుకునేందుకు రెండు నెలలుగా మున్సిపల్ ఉద్యోగులు శ్రమించారు. ఇందులో ఇప్పటి వరకు 4,545 మంది పెన్షనర్లను గుర్తించగా 1,201 మంది అందుబాటులోకి రాలేదు. ఇందులో 483 మంది మరణించినట్లు నిర్ధారించారు. మిగిలిన 718లో అసలైన లబ్ధిదారులు ఉన్నారా.. బినామీలు ఉన్నారా అనేది తేలాల్సి ఉంది.
లబ్ధిదారులు
పెన్షన్ రకం
గ్రామీణ
ప్రాంతాల్లో
తొలగించిన
పెన్షన్లు
2,702
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ,
డోర్నకల్
మున్సిపాలిటీల్లో
1,201
రికవరీ చేయిస్తాం..
లబ్ధిదారుడు మరణిస్తే అతని పింఛన్ నిలిపేస్తాం. అయితే కుటుంబ సభ్యులు, ఇతర ఉద్యోగులు ఈ విషయం మభ్యపెడుతున్నారు. దీంతో చనిపోయిన వారి పేరున నెలల తరబడి పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ అవుతున్నాయి. మున్సిపాలిటీల్లో మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా బ్యాంకులో పడిన డబ్బులు, డ్రా చేసిన డబ్బులు రికవరీ చేసేందుకు సిద్ధమవుతున్నాం.
– మధుసూదన్ రాజు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి


