గోవిందరావుపేట : బంధువు పెద్దకర్మకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కర్లపల్లిలో విషాదం నింపింది. మండల పరిధిలోని మచ్చాపూర్ శివారులో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్లపల్లి గ్రామానికి చెందిన అరెం భిక్షపతి (35), ఈక చిన్నప్పయ్య (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. అంకన్నగూడెంలో బంధువు పెద్దకర్మకు వెళ్లేందుకు వీరిద్దరు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఇంటి నుంచి వెళ్లిన సుమారు 20 నిమిషాలకే మచ్చాపూర్ సమీపంలో ఎదురుగా ఐరన్ లోడ్‌తో వస్తున్న టీజీ 12టీ 3666 నంబర్ గల లారీ ఒక్కసారిగా బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇరువురు రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పస్రా పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే లారీ డ్రైవర్ అర్జున్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులు, స్థానికులు పొక్లెయినర్ సాయంతో గంటపాటు శ్రమించి అర్జున్‌ను క్యాబిన్‌ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అతడిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అరెం భిక్షపతికి భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా, ఈక చిన్నప్పయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ప్రాథమిక విచారణలో లారీ అధిక వేగంతో రావడం లేదా నిర్లక్ష్యంగా నడపడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కర్లపల్లికి తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
ప్రమాదంలో కర్లపల్లికి చెందిన
ఇద్దరి దుర్మరణం


