కేసముద్రం : స్థానికులు తనను పదే పదే అవమానిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన మండలంలోని బోడమంచ్యా తండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. బానోత్ లాల–మంగ దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు కుమార్తెల వివాహం చేశారు. చిన్న కూతురు బానోత్ తనుశ్రీ (19) డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలో రెండ్రోజులుగా ఇంటివద్ద ఉన్న తనుశ్రీని, ఇదే తండాకు చెందిన జాటోత్ సీతారామ్, అమ్మి, రమ్య ముగ్గురు దూషిస్తూ పదేపదే అవమానిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తనుశ్రీ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి పక్కనున్న వారు గమనించడంతో ఉరివేసుకుని కనిపించడంతో మృతదేహాన్ని కిందకు దించారు. విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు కూతురి శవంపై పడి బోరున విలపించారు. తమ కూతురు చావుకు మీరే కారణమంటూ సీతారామ్ ఇంటి వద్ద తనుశ్రీ శవంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అనంతరం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతికిరణ్ తెలిపారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు.


