● రైల్వే జీఎం, డీఆర్‌ఎంను కోరిన వరంగల్ ఎంపీ కావ్య
కాజీపేట రూరల్ : కాజీపేటలో ప్రతిపాదిత బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన రైల్వే భూమిని కేటాయించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డీఆర్‌ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం 2025, జూన్ 4న జరిగిన భూ మార్పిడి అంశంపై వారితో ఎంపీ చర్చించారు. భూ మార్పిడి ప్రక్రియను వరంగల్– హనుమకొండ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. భూ మార్పిడి ప్రక్రియను పూర్తి చేసేందుకు రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన నిర్వహించి వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. బస్టాండ్ నిర్మాణం పూర్తయితే ట్రైసిటి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, ట్రాఫిక్ తగ్గింపు వంటి ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని ఎంపీ కావ్య పేర్కొన్నారు.


