హన్మకొండ: విద్యుత్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి వినియోగం ఒక్కసారిగా పెరిగింది. శీతాకాలం ముగియడంతోపాటు ఎండలు మండుతుండడంతో ఉక్కపోత పెరిగింది. దీంతో ఉపశమనం కోసం ఏసీలు, ఫ్యాన్ల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో డిమాండ్ కూడా పెరిగింది. ఈ డిమాండ్ నిలకడగా కాకుండా ప్రతీ రోజు పెరుగుతుండడంతో మే మాసం నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అనే మీమాంస నెలకొంది.
ప్రతీ రోజు గరిష్ట స్థాయిలో పెరగడమే..
టీజీ ఎన్పీడీసీఎల్‌లో అధిక శాతం వ్యవసాయానికి, గృహ అవసరాలు, వ్యాపార, వాణిజ్య అవసరాలు, చిన్న పరిశ్రమలకు విద్యుత్ వినియోగిస్తారు. సంస్థ పరిధిలో పరిశ్రమలు పెద్దగా లేవు. అయినా విద్యుత్ డిమాండ్ విఫరీతంగా పెరుగుతోంది. ఫిబ్రవరిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 6,057 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. అదే విధంగా మార్చి 1న 6,267 మెగావాట్ల, 2వ తేదీన 6,273, మెగావాట్లు, 3న 6,441 మెగావాట్లకు పెరిగింది. ఫలితంగా టీజీ ఎన్పీడీసీఎల్ చరిత్రలో వరుసగా ప్రతీ రోజు గరిష్ట స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. విద్యుత్ వినియోగం ఫిబ్రవరి 27న 93.50 మిలియన్ యూనిట్లు జరిగింది. 28న 95.62 మి లియన్ యూనిట్లు, అదే విధంగా ఈ నెల 1న 9 8.23 మిలియన్ యూనిట్లు, 2వ తేదీన 100.28 మి లియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది.
పెరిగిన పంటల సాగు విస్తీర్ణం..
వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. దీంతో పాటు భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు పూర్తి కావడంతోపాటు ముందుగా వేసిన పంట పొట్ట దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పైరుకు అధిక సాగు నీరు అవసరం. దీంతోపాటు ఆరుతడి పంట మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. ఆరుతడి పంటలకు నీరు అవసరం కావడంతో వ్యవసా య అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది.
యాసంగిలో అన్ని పంటలు
37,39,591 ఎకరాల్లో సాగు
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో అన్ని పంటలు కలిపి ఈ యాసంగిలో 37,39,591 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది యాసంగిలో 37,30,434 ఎకరాల్లో సాగు చేశారు. ప్రధాన పంట వరి గతేడాది 25,76,315 ఎకరాల్లో సాగు చేయగా ఈ యాసంగిలో 27,84,258 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న గతేడాది 6,24,006 ఎకరాల్లో సాగు చేయగా ఈ యాసంగిలో 17,75,515 ఎకరాల్లో సాగు చేశారు. అదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో శనగ పంట చెప్పుకోదగ్గ విస్తీర్ణంలో సాగు చేశారు. వేసవి రావడంతో మరో వైపు గృహ, వాణిజ్య, ఇతర విభాగాల్లోను వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది.
రోజురోజుకూ
పెరుగుతున్న వినియోగం
రికార్డులు చేధిస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్
ఈ నెల 2న 100.28 మిలియన్ యూనిట్ల వినియోగం.. 6,273 మెగావాట్ల విద్యుత్ డిమాండ్
ఈ నెల 3న 6,441 మెగావాట్లకు పెరిగిన డిమాండ్


