జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్‌పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హోలీ పండుగ రోజు జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ మండలం శామీర్‌పేటకు చెందిన బండిగారి శివకృష్ణగౌడ్ బొలెరోలో జనగామ నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. జనగామ జ్యోతినగర్‌కు చెందిన మరాటి దినేశ్ (23), బాల్దె ధనుశ్ (20) బైక్‌పై చౌరస్తాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జిపై బొలెరో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో దినేశ్, ధనుశ్ తీవ్రంగా గాయపడ్డారు.గమనించిన స్థానికులు వెంటనే 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం దినేశ్‌ను హైదరాబాద్, ధనుశ్‌ను వరంగల్ ఎంజీఎం తరలించగా ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. బొలెరో డ్రైవర్ శివకృష్ణ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇద్దరు అన్నదమ్ములే..
జ్యోతినగర్‌లో విషాదం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరుకు చెందిన మరాటి వీరస్వామి, భాగ్య దంపతుల ఏకై క కుమారుడు దినేశ్ బీటెక్ పూర్తి చేసి, ఫొటోగ్రఫీ నేర్చుకుంటున్నాడు. జనగామ మండలం వడ్లకొండకు చెందిన దివంగత బాల్దె కృష్ణ, మంగ దంపతుల కుమారుడు ధనుశ్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. దినేశ్, ధనుశ్ పెద్దమ్మ, చిన్నమ్మ కుమారులు. వరుసకు ఇద్దరు అన్నదమ్ములు. దినేశ్‌కు తండ్రి లేకపోవడంతో తల్లితో కలిసి జ్యోతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. స్నేహితుడి బైక్‌పై కలిసి బయలుదేరిన ఇద్దరు అన్నదమ్ముళ్లు తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.
శోకసంద్రంలో కుటుంబాలు ..
పండుగ సందడి నడుమ జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాలను శోకసముద్రంలో ముంచేసింది. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు ఒంటరి చేసి వెళ్లిపోయాడని దినేశ్ తల్లిదండ్రులు విలపిస్తుండగా, ధనుశ్ తల్లి కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లిన కుమారుడిని తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
ఇద్దరు యువకుల దుర్మరణం
మరొకరి పరిస్థితి విషమం
జనగామ ఫ్లైఓవర్‌పై ఘటన


