ములుగు తొలిపీఠం కాంగ్రెస్‌కే..
ములుగు: ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకుంటుంది. 1956లో తాలుకాగా ఉన్న ములుగును 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీగా ఏర్పాటు చేసింది. అనంతరం 2011లో మేజర్ పంచాయతీగా మారిన ములుగు 2019లో నూతన జిల్లాగా ఆవిర్భవించింది. 2024లో బండారుపల్లి, జీవింతరావుపల్లి కలుపుకొని ప్రభుత్వం ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 20 వార్డులకు తొలిసారి జరిగిన ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. మంత్రి సీతక్క మున్సిపాలిటీపై తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దీంతో 20 వార్డులకు గాను 12 వార్డులు కాంగ్రెస్ కై వసం చేసుకోవడంతో ఈనెల 16న కాంగ్రెస్ కౌన్సిలర్‌గా గెలుపొందిన బీసీ మహిళ చైర్ పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.


