వైభవంగా ‘వీరన్న’ అంకురార్పణ పూజలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అంకురార్పణ పూజలు వైభవంగా జరిగాయి. రాత్రి 7.30గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, కంకణధారణ, దీక్షాధారణ పూజలు శాస్త్రోక్తంగా చేశారు. అంకురాలతో అంకురారోహణం పూజ నిర్వహించారు. అఖండ దీపారాధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు బసవముద్దను ఎగురేశారు. కార్యక్రమంలో ఆలయ ఇఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలగా ని శ్రీనివాస్, చిన్నం గణేశ్, భిక్షపతి, సోమ్ల, శకృ, ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నేడు వీరభద్రస్వామి వారి కల్యాణం..
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం జరగనుంది. నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో కల్యాణ వేడుకలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు శైవ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వైవ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత శనివారం తెలిపారు. ఆదివారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయానికి, రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. పాలకుర్తికి ప్రతీ 30 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరుతుందన్నారు. ములుగు నుంచి రామప్పకు ప్రతీ 30 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


