వెబ్ కెమెరాతో పర్యవేక్షణ!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలను ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే వాల్యుయేషన్ చేయనున్నారు. జవాబు పత్రాలను స్కానింగ్ చేసి ఆన్‌లైన్‌లో వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టే పనులను ఓ సంస్థకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల జవాబుపత్రాల వాల్యుయేషన్‌ను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. కేయూ పరిధిలో త్వరలో నిర్వహించబోయే డిగ్రీ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు, అలాగే మొదటి, మూడో, ఐదో సెమిస్టర్‌ల పరీక్షల జవాబుపత్రాలను ఇక ఆన్‌లైన్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టాలని పరీక్షల విభాగం అధికారులు నిర్ణయించారు. ఈనెల 20నుంచి ఆయా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
ఎక్కడినుంచినైనా వాల్యుయేషన్..
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగానికి వచ్చి డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలు వాల్యుయేషన్ చేసేవారు. అయితే దూరప్రాంతాల నుంచి ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి అధ్యాపకులు రావడంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే ఎక్కువగా మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. మూల్యాంకనంలో పాల్గొన్నవారికి ఒక బుక్‌లెట్‌కు కొంత రెమ్యూనరేషనల్ చొప్పున చెల్లించడంతోపాటు టీఏ, డీఏ చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఏ జిల్లాకు చెందిన అధ్యాపకులైనా ఎక్కడ నుంచైనా కంప్యూటర్ ద్వారా వాల్యుయేషన్ చేయొచ్చు. పరీక్షల విభాగం నుంచి సబ్జెక్టులవారీగా జవాబుపత్రాలను స్కాన్ చేసి సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఎగ్జామినర్లుకు పాస్‌వర్డ్‌ను అందజేస్తారు. ఓటీపీతో నిబంధనల ప్రకారం ఎన్ని పేపర్లు అందుబాటులో ఉంచాలో అన్ని పేపర్లు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. తద్వారా ఎగ్జామినర్లు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశం నుంచే వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వాల్యుయేషన్ ఎలా కొనసాగుతుందో సబ్జెక్టులవారీగా నియామకమయ్యే చీఫ్ ఎగ్జామినర్లు ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షిస్తారు.
అన్ని పేజీలు చూస్తేనే సబ్మిట్
ప్రతీ సబ్జెక్టు బుక్ లెట్ 28 పేజీల వరకు కూడా ఉంటుంది. ఎగ్జామినర్ అన్ని పేజీలను చూసి మార్కులు వేస్తేనే సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఒక పేజీ చూడకున్నా సబ్మిట్ కాదు. 3 నిమిషాల సమ యం గడిస్తే సబ్మిట్‌కు అవకాశం ఉంటుంది. మాన్యువల్ పద్ధతిలో ఒక ఎగ్జామినర్ వాల్యుయేషన్ చేసిన జవాబుపత్రాల్లో ఒకటి రెండు పేపర్లు సీఈ పరిశీలిస్తారు. ఇదే విధానం ఆన్‌లైన్‌లో కూడా కొనసాగించనున్నట్లు తెలిసింది. ఎగ్జామినర్లు తప్పులు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థికి వచ్చిన మొత్తం మార్కులు ఆన్‌లైన్‌లోనే అప్‌లోడు చేస్తారు. ఎగ్జామినర్లు వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతం నుంచి వాల్యుయేషన్ చేస్తుండడంతో ఇక టీఏ, డీఏలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఓ సంస్థకు స్కానింగ్ ప్రక్రియ అప్పగింత
ఎక్కడినుంచైనా
వాల్యుయేషన్‌కు అవకాశం
ఈనెల 6 నుంచి
అవగాహన సమావేశాలు
జవాబుపత్రాల వాల్యుయేషన్‌లో అవకతవకలకు చోటులేకుండా ఉండేందుకు ఎగ్జామినర్ వినియోగించే కంప్యూటర్ లేదా ల్యాప్‌ట్యాప్‌కు వెబ్ కెమెరాను అమర్చుకోవాలనే నిబంధనలు విధించారు. తద్వారా ఎగ్జామినర్ కాకుండా ఇతరులు వాల్యుయేషన్ చేసే అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అయితే ఎగ్జామినర్లు వెబ్ కెమెరా ఏర్పాటుకు అంగీకరిస్తారా.. లేదా అనేది వేచిచూడాలి.
అధ్యాపకులకు అవగాహన సమావేశాలు
కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, ఎగ్జామినర్లకు ఆన్‌లైన్ వాల్యుయేషన్‌పై అవగాహన కల్పించేందుకు ఈనెల 6నుంచి 10వ తేదీ వరకు పరీక్షల విభాగం అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. సంబంధిత జవాబు పత్రాలు స్కాన్‌చేసే సంస్థతోపాటు ఎక్స్‌పర్ట్స్ ఎలా వాల్యుయేషన్ చేయాలో నిబంధనలను ఎగ్జామినర్లకు వివరించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈ నెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాశాలల అధ్యాపకులకు ఖమ్మం పీజీ కళాశాలలో, ఈనెల 7న ఉమ్మడి వరంగల్ జిల్లా కళాశాలల అధ్యాపకులకు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో, 8న మంచిర్యాల, 10న నిర్మల్, ఆదిలాబాద్ కేంద్రాల్లో అధ్యాపకులకు అవగాహన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇప్పటికే అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ పరీక్షల విభాగం అధికారులు లేఖలను పంపారు. అంతేగాకుండా ప్రతి కళాశాలనుంచి సబ్జెక్టులవారీగా అధ్యాపకుల వివరాలను పరీక్షల విభాగానికి పంపాలని కోరినట్లు సమాచారం.
నూతన విధానంలో కేయూ డిగ్రీ జవాబుపత్రాల వాల్యుయేషన్


