బ్రహ్మోత్సవాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు వేళాయె

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

బ్రహ్మోత్సవాలకు వేళాయె

బ్రహ్మోత్సవాలకు వేళాయె

14న అంకురార్పణతో వీరభద్రస్వామి జాతర ప్రారంభం

15న స్వామివారి కల్యాణ మహోత్సవం

కురవి: కోరిన కోర్కెలు తీర్చే కురవి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 14న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఆలయంలో మహాశివ రాత్రి సందర్భంగా స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

14న షురూ..

కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న(శనివారం) ఉదయం 9గంటలకు అర్చకుల ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకొస్తారు. సాయంత్రం 7గంటలకు గణపతి పూజ, పుణ్యహవచనములు, అఖండ దీపారాధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, రాత్రి 10 గంటలకు బసవముద్ద పడుతుంది. ఈనెల 15న(ఆదివారం) మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణ మహోత్సవం కనులపండువగా జరుగుతంది. ఉదయం 4నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వామి వారికి పూర్ణాభిషేకాలు ఉంటాయి. స్థానిక శివాలయంలో ఉదయం 5నుంచి రాత్రి 12 గంటల వరకు పార్వతిరామలింగేశ్వరస్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం 7గంటలకు గ్రామ సేవ, ఎదుర్కోలు, రాత్రి 1.50గంటలకు(తెల్లవారితే సోమవారం) భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కల్యాణ వేడుక జరుగుతుంది. ఈనెల 16నుంచి మార్చి 1వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 18న కురవి పెద్ద చెరువులో తెప్పోత్సవం, 20న రథోత్సవం, 21న బండ్లు తిరుగుట, పారువేట, 22న దోపోత్సవం, వసంతోత్సవం, పెద్ద చెరువులో త్రిశూలస్నానం, సాయంత్రం 7గంటలకు ఏకాంతసేవ, సదస్యం నాగవెల్లి ఉంటాయి. 23న స్వామివారి పవళింపుసేవ, 27న పార్వతిరామలింగేశ్వరస్వామి కల్యాణం, చివరగా మార్చి 1న పదహారు రోజుల పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఆలయ చరిత్ర..

క్రీ.శ 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూటరాజు భీమరాజు కురవిని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అప్పుడు వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం కాకతీయ తొలి స్వతంత్ర రాజైన ఒకటో బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండో బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకం(చెరువును) తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతిస్తంభ దీపాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ ఆలయంలో రాతి దీప స్తంభం దర్శనమిస్తుంది. తూర్పు రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు.

స్వామివారి ప్రాశస్త్యం..

సకల శక్తిమూర్తివరాల ప్రదాత అయిన వీరభద్రుడు పడమటముఖుడై దశహస్తుడై, త్రినేత్రుడై రౌత్రపరాక్రమాలతో విలసిల్లుతున్నాడు. భక్తులను ఆదుకునే భోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకోసం ఆలయానికి భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. దర్శించుకున్న భక్తులకు ఆయురారోగ్యాలను, సకల సంపదలను ఇస్తాడని నమ్మకం. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి ఉండి భద్రకాళీ అమ్మవారితో కలిసి వెలసి ఉన్నాడు. స్వామివారికి ఇరువైపులా శివుడు (లింగాకారంలో) దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణ దిశలో భద్రకాళీ అమ్మవారు స్వయంభుగా వెలసి భక్తుల పూజలందుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement