పోలీసు స్టేషన్ నుంచి యువకుడి పరారీ?
● అరగంటలోనే పట్టుకున్న పోలీసులు..
మామునూరు: ఓ చోరీ కేసులో విచారణ పేరుతో నలుగురు అనుమానితులను మామునూరు పోలీసులు స్టేషన్‌కు తీసుకురాగా ఇందులో ఓ యువకుడు పరారైనట్లు సమాచారం. ఇద్దరు యువకులు, ఇద్దరు బాలురను స్టేషన్‌లో విచారిస్తుండగా ఓ యువకుడు పోలీసుల కళ్లు కప్పి గోడ దూకి చెట్లలోకి పరుగులు పెట్టాడు. గమనించిన పోలీసులు వెంటపడి అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఇదే పోలీస్ స్టేషన్‌లో గతేడాది గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితడు పరారీ కాగా.. అతడి ఆచూకీ కనిపెట్టి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనను పోలీస్ కమిషనర్ సీరియస్‌గా తీసుకుని ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఆ ఘటన మరవక ముందే సోమవారం రెండోసారి విచారణలో ఉన్న ఓ యువకుడు పరారీ కావడం గమనార్హం. అయితే అరగంటలోనే పోలీసులు ఆ యువకుడిని పట్టుకున్నారు.
ఐదోరోజు ఆదాయం రూ. 1,12,63,000
● మేడారం మహాజాతర 163 హుండీలు లెక్కింపు
హన్మకొండ కల్చరల్: హనుమకొండ లష్కర్‌బజార్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఐదోరోజు సోమవారం 163 హుండీలు లెక్కించగా రూ. 1,12,63,000 ఆదాయం సమకూరిందని మేడారం ఈఓ వీరస్వామి వెల్లడించారు. ఇప్పటి వరకు 788 హుండీలు లెక్కించగా మొత్తం రూ. 11,83,85,116 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు.


