‘అక్షయ పాత్ర’ సేవలు అనిర్వచనీయం
వరంగల్: పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ ఆవరణలోని ఇస్కాన్ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో హెచ్‌డీబీ సహకారంతో ఏర్పాటు చేసిన వంటశాలలోని అధునాతన యంత్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవ సంస్థగా కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పడిన సంస్థ ఇస్కాన్ అన్నారు. అనేక విద్యా సంస్థలను సంస్థ నడుపుతూ హరే కృష్ణ సంకీర్తన ఉచిత ప్రసాద వితరణకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్‌కు అనుబంధంగా పని చేస్తున్నదన్నారు. ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో బెంగుళూరు కేంద్రంగా అక్షయపాత్రను ప్రారంభించారని తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్న అతిపెద్ద సంస్థ ఇదేనన్నారు. దేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 22 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ప్రతీరోజు 20 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారన్నారు. మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
కొండా సురేఖ


