తహసీల్దార్ కార్యాలయ భవనానికి తాళం
● అద్దె రూ.6లక్షలు బకాయి
చెల్లించకపోవడంతో యజమాని తాళం
ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు నుంచి ప్రైవేట్ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. రెండేళ్లుగా అద్దె చెల్లించేదు. సుమారు రూ.6లక్షల పైగా అద్దె బకాయి ఉండడంతో యజమాని సమ్మయ్య సోమవారం తాళం వేశారు. దీంతో అధికారులు, సిబ్బంది బయటనే ఉండిపోయారు. పలు రకాల పనులపై వచ్చిన ప్రజలు నిరీక్షిస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టికి తీసుకెళ్లి అద్దె చెల్లిస్తామని యజమానిని ఒప్పించడంతో తాళం తీశారు. కాగా, అద్దె ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చేసేదిలేక భవనానికి తాళం వేసినట్లు సమ్మయ్య తెలిపారు. భవన నిర్మాణానికి బ్యాంకు రుణం తీసుకున్నానని, అద్దె రాకపోవడంతో ఈఎంఐ కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు.
తహసీల్దార్ కార్యాలయ భవనానికి తాళం


