ప్రజలకు రవాణా కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు రవాణా కష్టాలు

Dec 23 2025 7:12 AM | Updated on Dec 23 2025 7:12 AM

ప్రజల

ప్రజలకు రవాణా కష్టాలు

మరిపెడ రూరల్‌: జిల్లాలోని మరిపెడ మండలం తానంచర్ల సమీపంలోని పాలేరు వాగుపై నిర్మించిన లోలెవల్‌ వంతెన గతేడాది కురిసిన భారీ వర్షాలకు కొతకు గురై కొట్టుకుపోయింది. దీంతో ఏడాదిగా పలు గిరిజన తండాలు, గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు అవతలి ఒడ్డున ఉన్న వాల్యతండా, కోట్యతండా, అజ్మీరా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 12 తండాల గిరిజన ప్రజలు, సరిహద్దు జిల్లాల ప్రజలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తారు. అయితే బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి రాళ్లు తేలాయి. ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. కాగా, ప్రభుత్వాలు మారినా వంతెన కష్టాలు తీరడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదిగా నిలిచిన రాకపోకలు..

పాలేరు వాగుపై లోలెవల్‌ వంతెన కొట్టుకుపోవడంతో ఏడాదిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వాగు మీదుగా మరిపెడ మండల కేంద్రానికి నిత్యం వందలాది మంది గిరిజనులు వెళ్తుంటారు. వివిధ సరుకులు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వస్తుంటారు. అయితే ఆయా గ్రామాల గిరిజన ప్రజలు వాగు దాటే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి సూర్యాపేట జిల్లా బికుమళ్ల గ్రామం శివారు 356 జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చుట్టూ తిరిగి రావడంతో ఖర్చుతో పాటు సమయం వృథా అవుతుందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.1.20 కోట్ల బ్రిడ్జి టెండర్‌ రద్దు..

గత ప్రభుత్వం హయాంలో పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అప్పుటి ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాగా పాలేరు వాగుపై కోతకు గురైన లోలెవల్‌ బ్రిడ్జికి రూ.1.20 కోట్లు నిధులు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్‌ ద్వారా ఓ కాంట్రాక్టర్‌ బ్రిడ్జి పనులను దక్కించుకున్నాడు. నిధులు సరిపోవని చివరి నిమిషంలో సంబంధిత అధికారులు బ్రిడ్జి టెండర్‌ పనులు రద్దు చేశారు. మళ్లీ లోలెవల్‌ వంతెన నిర్మిస్తే దానిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుందని, అందుకు ఈ నిధులు సరిపోవని హైలెవల్‌ బ్రిడ్జిని నిర్మించాలని, సుమారు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి హైలెవల్‌ వంతెనకునిధులు మంజూరు చేసి తమను వాగు కష్టాల నుంచి గట్టు ఎక్కించాలని ఆయా గిరిజన తండాలు, గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

ప్రతీ ఏడాది ఇదే అవస్థ..

వర్షాలు కురిసి వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా రాకపోకలు నిలిచి ఇబ్బందులు పడుతున్నాం. లోలెవల్‌ బ్రిడ్జి కావడంతో పై నుంచి వాగు ప్రవహిస్తోంది. వాగు దాటే దారి లేక మండల కేంద్రానికి వెళ్లలేక పోతున్నాం. ప్రతీ ఏడాది ఇబ్బంది పడాల్సి వస్తోంది. పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.

–బానోతు అమ్రియా, కోట్యతండా, మరిపెడ

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన

పాలేరు వాగు లోలెవల్‌ వంతెన

నడవడానికి కూడా వీలులేని పరిస్థితి

ఏడాదిగా పలు గ్రామాలకు

రాకపోకలు బంద్‌

పక్క జిల్లా సరిహద్దు గ్రామాలనుంచి ప్రయాణం

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రజలకు రవాణా కష్టాలు1
1/1

ప్రజలకు రవాణా కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement