అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం

- - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ను రాష్ట్ర పోలీస్‌ అకాడమికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్‌ను బదిలీపై జిల్లాకు పంపారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆకస్మిక బదిలీపై సోషల్‌ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. 2021 డిసెంబర్‌ 26న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా 20 నెలల్లో బదిలీ కావడం.. దీని వెనుక ఏం జరిగింది అనేది అటు అధికారులు.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

ఆకస్మిక బదిలీతో షాక్‌..
జిల్లా పోలీస్‌బాస్‌ ఆకస్మిక బదిలీతో ఆశాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌ అధికారులను ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదు. దీంతో ఆయన ఎన్నికల వరకు ఉంటారని అందరు భావించారు. అయితే కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయ పరిణామాలే ఆయన బదిలీకి కారణం అని కొందరు చెబుతుండగా.. ఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ తీసుకున్న నిర్ణయం అని మరికొందరు చెబుతున్నారు. కుటుంబ రాజకీయ పరిణామాలే కారణమైతే ఎస్పీ బదిలీతోనే ఆగిపోతుంది.

అలా కాకుంటే ఎస్పీతో పాటు మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని పలువురు సీనియర్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్పీ బదిలీ వార్తతో ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు మాత్రం ఆందోళనగానే ఉన్నట్లు సమాచారం.

ఆ కోపమేనా..?
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ తన బిడ్డను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇవ్వడం లేదు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె మనస్తాపం చెందిగా.. భర్త శ్యాం నాయక్‌ ఉద్యోగం వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈమేరకు నేడో రేపో రేఖానాయక్‌ కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేఖానాయక్‌పై కోపంతో ఆమె అల్లుడు ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు మానుకోటలో ప్రచారం జరుగుతోంది.

Read latest Mahabubabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top