లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టొద్దు
గార్ల: మండలంలోని మున్నేరు వాగు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ నిర్మించొద్దని డిమాండ్ చేస్తూ మున్నేరు జలసాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్ గార్ల నెహ్రూ సెంటర్‌లో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. మండల రైతులకు చుక్క నీరు అందించని లింక్ కెనాల్‌ను రద్దు చేసి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీఓ నంబర్ 1076 ద్వారా మంజూరు చేసిన మున్నేరు ప్రాజెక్ట్ నిర్మిస్తే మండల ప్రజలకు సాగునీటితో పాటు తాగునీరు సమృద్ధిగా లభిస్తుందన్నారు. లింక్ కెనాల్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 98ను వెంటనే రద్దు చేయాలని, ముల్కనూరులో మున్నేరు, అలుగేరు వాగులు కలిసే ప్రాంతంలో మున్నేరు ప్రాజెక్ట్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. లింక్ కెనాల్‌కు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు ర్యాలీలో నినాదాలు చేశారు. అనంతరం మండలంలోని 20 గామ పంచాయతీల్లో సుమారు 100ద్విచక్రవాహనాలతో 2గంటల పాటు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జలసాధన కమిటీ కోకన్వీనర్లు గౌని ఐలయ్య, కందునూరి శ్రీనివాస్, కట్టెబోయిన శ్రీనివాస్, జడ సత్యనారాయణ, సక్రు, జంపాల వెంకన్న, రాధాకృష్ణ, కత్తి సత్యం, గిన్నారపు మురళి, అజ్మీరా వెంకన్న, ఈశ్వర్‌లింగం, పెద్దవెంకటేశ్వర్లు, హరి, రైతులు పాల్గొన్నారు.


