సూత్రధారులెవరు..?
బయ్యారం: మండలంలోని నాలుగు గ్రామపంచాయతీల కార్యదర్శుల డిజిటల్ కీ ని ఉపయోగించి 291 నకిలీ సర్టిఫికెట్లు జారీ కావడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ జనన, మరణ సర్టిఫికెట్లు ఇచ్చిన వారు ఎవరనే ప్రశ్నలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో ఉండాల్సిన డిజిటల్ కీ లు ఇతరుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని, సూత్రధారులను బయటికి లాగాలని పలువురు కోరుతున్నారు.
వారికి సర్టిఫికెట్లు..
పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ కీ నుంచి జనన, మరణ సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంది. అయితే ఆయా పంచాయతీల్లో జన్మించిన, మరణించిన వారికి మాత్రమే విచారణ జరిపి కార్యదర్శులు సర్టిపికెట్లు ఇస్తారు. తాజాగా రాష్ట్రంలోని మహబూ బాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, ములుగు, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాలో ని పలు ప్రాంతాలకు చెందిన వారితో పాటు మహా రాష్ట్రకు చెందిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉండడంతో మండల పరిషత్ అధికారులు, సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అసలు విషయమేమిటి..
స్థానికంగా ఎవరైనా మరణిస్తే ఆయా పంచాయతీలు, పట్టణాల్లో సంబంధిత వ్యక్తుల కుటుంబసభ్యులకు మరణ ధ్రువీకరణపత్రం జారీ చేస్తారు. అదేవిధంగా పిల్లలు జన్మించిన ఏడాది వ్యవధిలో నమోదు చేసుకుంటే అధికారులు సర్టిఫికెట్లు ఇస్తా రు. అయితే మండలంలో బాల్యాతండా, నామాలపాడు, కొత్తగూడెం, ఇర్సులాపురం పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ కీని ఉపయోగించి ఇతర జిల్లాలు, రాష్ట్రానికి చెందిన వారికి అక్రమంగా 272 జనన, 19 మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అధికా రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నలుగురు జీపీ కార్యదర్శుల డిజిటల్
కీ తో 291 నకిలీ సర్టిఫికెట్లు జారీ
రాష్ట్రంలోని పలు జిల్లాల వాసులతో పాటు మహారాష్ట్ర వాసికి సర్టిఫికెట్లు
పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
సూత్రధారులెవరు..?


