బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా చిన్నారుల కేశఖండన, వివాహాలు ఉండటంతో వారి బంధుమిత్రులో పాటు, స్వామి, అమ్మవార్ల దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో ఆలయం జనసందోహంగా మారింది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, నైవేద్యాలు సమర్పించి మహా మంగళహారతి నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. ఉపకమిషనర్ రామాంజనేయులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఏర్పాట్లు చేశారు.
వలస కూలీల
ట్రాక్టర్ బోల్తా !
● 25 మంది కులుమాలకు చెందిన
వలస కూలీలకు గాయాలు
● ఇద్దరు మహిళకు తీవ్ర గాయాలు
గోనెగండ్ల: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం ఖైరతాబాద్‌లో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో గోనెగండ్ల మండల కులుమాల గ్రామానికి చెందిన 25 మంది వలస కూలీలు గాయపడ్డారు. రెండు నెలల క్రితం కులుమాల గ్రామం నుంచి దాదాపు 200 మంది వలసలు వెళ్లారు. అయితే అందులో 50 మంది సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం ఖైరతాబాద్ గ్రామంలోని పత్తి పొలాల్లో పత్తి తీత పనులు చేస్తున్నారు. అక్కడే కొన్ని రోజులుగా నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఖైరతాబాద్ గ్రామం నుంచి పొలం యాజమానికి చెందిన ట్రాక్టర్‌లో దాదాపు 25 మంది కూలీలు పత్తి పొలానికి బయలుదేరారు. పొలం సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీలో ఉన్న 25 మంది కూలీలు కింద పడటంతో గాయాలయ్యాయి. సుహాసిని, సుందరమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
డెటాయిల్ తాగి
బాలుడికి అస్వస్థత
ఆదోని అర్బన్: పట్టణంలోని మట్కారీవాడికి చెందిన ఇషాంత్‌కుమార్ అనే రెండేళ్ల బాలుడు ఇంట్లో డెటాయిల్ తాగి శనివారం అస్వస్థతకు గురయ్యాడు. ఔట్‌పోస్టు కానిస్టేబుల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇషాంత్‌కుమార్ ఇంట్లో ఆడుకుంటూ పక్కనే ఉన్న డెటాయిల్ బాటిల్ తీసుకోని అందులోని ద్రావణాన్ని తాగి అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డాక్డర్లు వైద్యం అందిస్తున్నారు.


