కర్నూలు(సెంట్రల్): అగ్రిగోల్డ్ బాధితుడు చివరకు రూపాయి కూడా అందాలని, అప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం సీఆర్ భవన్‌లో నిర్వహించిన ఉమ్మడి కర్నూలు జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో 8 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సంస్థ విద్యావంతులైన 5 లక్షల మంది నిరుద్యోగులను ఏజెంట్లుగా నియమించుకుని 32 లక్షల మందిని మోసం చేసి రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు సేకరించిందన్నారు. 12 ఏళ్లుగా బాధితులు ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా న్యాయం జరగడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వేసిన మంత్రలు కమిటీ సిఫారస్ మేరకు 15 రోజుల క్రితం అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చినా ప్రయోజనం లేదన్నారు. తక్షణమే ప్రత్యేక కోర్టు అమలుల్లోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల 9 నుంచి 16 కేంద్రాల్లో బాధితుల నుంచి బాండ్లను సేకరిస్తున్నారని, మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్లలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. బాధితులకు మరింత సహకారం అందించేందుకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎస్ మునెప్పును నియమించామని, ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప, సీనియర్ నాయకులు మనోహర్ మాణిక్యం అసోసియేషన్ నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రత్యేక కోర్టును అమలు చేయాలి
మండల స్థాయిలో
బాండ్ల సేకరణ చేపట్టాలి
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్
ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్
రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
ముప్పాళ్ల నాగేశ్వరరావు


