● కిడ్నీలో క్యాన్సర్ కణితిని తొలగించిన వైద్యులు
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారి ఓ వ్యక్తికి కిడ్నీ, గుండెకు వెళ్లే రక్తనాళానికి ఉన్న క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు తొలగించి ఆపరేషన్ విజయవంతం చేశారు. వివరాలను శనివారం ఆసుపత్రిలోని యురాలజీ విభాగంలో హెచ్‌ఓడీ డాక్టర్ ముత్యశ్రీ వెల్లడించారు. మద్దికెర మండలం పెరవళి గ్రామానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి కడుపు నొప్పి రావడంతో ఇటీవల పలు ఆసుపత్రులు తిరిగారు. వైద్యులు పరీక్షించి అతనికి కిడ్నీ, గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కణితి ఏర్పడి క్యాన్సర్‌గా మారిందని గుర్తించారు. ఈ మేరకు అతనికి ఆపరేషన్ చేసేందుకు ఏ ఒక్క ఆసుపత్రీ ముందుకు రాలేదు. దీంతో అతను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గత నెల 23న వచ్చారు. వైద్యులు అతన్ని పరీక్షించి కిడ్నీ క్యాన్సర్ కిడ్నీ నుంచి ఇన్‌ఫీరియర్ వీనా కావా(ఐవీసీ) అనే ప్రధాన రక్తనాళంలోకి వ్యాపించి, ఆ రక్తనాళాన్ని పూర్తిగా మూసివేసిన అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఉందని గుర్తించారు. ఈ మేరకు అతనికి ఈ నెల 12న 8 గంటల పాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా క్యాన్సర్ కణితిని తొలగించారు. ఈ ప్రక్రియలో భాగంగా రైట్ రేడియల్ నెఫ్రాక్టమి, కంప్లీట్ ఇన్‌ఫీరియర్ వీనా కావా, లెఫ్ట్ రీనల్ వీన్ త్రాంబోక్టమీ విత్ ప్రిసర్వేషన్ ఆఫ్ ది వీన్ వంటి ఆపరేషన్‌లు నిర్వహించినట్లు డాక్టర్ ముత్యశ్రీ వివరించారు. ఆపరేషన్ అనంతరం రోగి కోలుకున్నాడని, మూత్ర విసర్జన బాగా జరుగుతుండటంతో పాటు రెండు కిడ్నీల పనితీరు బాగుందని తెలిపారు. ఈ ఆపరేషన్‌ను తనతో పాటు యురాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సేపూరి బాలరవితేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మహేష్, డాక్టర్ అరుణ్, డాక్టర్ గౌతమ్, అనెస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, డాక్టర్ సుధీర్, డాక్టర్ అరుణలత, డాక్టర్ సౌజన్య నిర్వహించినట్లు తెలిపారు. శనివారం వైద్యబృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అభినందించారు. ఒక రోగి కిడ్నీ క్యాన్సర్ ఐవీసీలోకి వ్యాపించి, ఆ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితిలో శస్త్రచికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు. ముఖ్యంగా రక్తనాళాన్ని పూర్తిగా తొలగించి, మిగిలిన కిడ్నీ నుంచి రక్తప్రసరణకు అవసరమైన మార్గాన్ని కాపాడటం ఎంతో నైపుణ్యం, అనుభవం అవసరమని పేర్కొన్నారు.


