మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ముందుగా భక్తులు గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రుల మూల బృందావన దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాయరు దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అన్నపూర్ణభోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్ల క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తుల కోలాహలంతో తుంగభద్ర తీరం కనువిందు చేసింది.
పీజీఆర్‌ఎస్‌పై క్యూఆర్‌కోడ్
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజలు సమర్పించిన అర్జీలు పరిష్కరించిన అనంతరం క్యూఆర్ కోడ్, వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ ద్వారా అభిప్రాయాలు తెలియచేయవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల నుంచి నేరుగా అందే అభిప్రాయాలు ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని తెలిపారు. అన్ని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్‌లను స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. అర్జీల పరిష్కారం సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
అన్నప్రసాద వితరణ పథకానికి భారీ విరాళాలు
● రికార్డు స్థాయిలో ఒక్కరోజు
రూ.15 లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.15 లక్షల విరాళాలు అందించారు. ఒక్కరోజు వ్యవధిలో ఇంతపెద్ద భారీ మొత్తం విరాళాలు రావడం రికార్డ్ స్థాయి అని చెప్పవచ్చు. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన పి.మాధవరావు రూ.10 లక్షల విరాళాన్ని దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావులకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన జి.నరసింగరావు రూ.4 లక్షల విరాళాన్ని పర్యవేక్షకులు కోమలికి అందజేశారు. అలాగే పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన పయ్యావుల వెంకట నవీన్‌కుమార్ రూ.1,50,265 విరాళాన్ని అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
శ్రీశైలం.. భక్తజనసంద్రం
శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుటున్నారు. కార్తీక మొదటి ఆదివారం వేకువజామున 4 గంటల నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయ ఉత్తర మాఢవీధిలో, గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి. భక్తులందరికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. క్యూ కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులకు కట్టుపొంగలి, పులిహోర, బిస్కెట్లు, మంచినీరుతో పాటు ఉదయం వేళలో వేడిపాలు అందజేశారు. సోమవారం లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


