● యాదవాడ సర్పంచ్ అభ్యర్థికి టీడీపీ
శ్రేణుల మధ్య కుదరని ఏకాభిప్రాయం
● చర్చలకు పోయి కర్రలతో కొట్టుకున్న
ఇరువర్గాలు
ఆళ్లగడ్డ: సర్పంచ్ పదవి కోసం అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య వర్గపోరు భగ్గుమంది. సర్పంచ్ అభ్యర్థిత్వం ఎవరికి కేటాయించాలనే అంశంపై పార్టీ కేడర్‌లో మొదలైన విభేదాలు చివరకు రోడ్డున పడ్డాయి. ఇరువర్గాల మధ్య ఎక్కడా ఏకాభిప్రాయం కుదరక పోవడంతో వివాదం తారా స్థాయికి చేరుకుంది. పరస్పరం కర్రలతో విక్షణా రహితంగా దాడులు చేసుకున్న ఆదివారం రాత్రి మండలంలోని యాదవాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘర్షనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామ సర్పంచ్ స్థానం ఎస్పీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో గ్రామంలోని టీడీపీ రెండు గ్రూపుల నాయకులు ఒకే కాలనీలో ఉండే ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలను పోటీకి దించేందు కు సిద్ధమయ్యారు. అయితే అధిష్టానం ఎవరో ఒకరిని మీరే ఎంపిక చేసుకుని పోటీలో నిలపాలని ఆదేశించినా ఎవరికి వారే పట్టువీడక పోవడంతో సమస్యను పంచాయితీ పెట్టుకుని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం పంచాయితీకి వెళ్లే క్రమంలోనే వెంట కర్రలు తీసుకుని వెళ్లిన ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడిచేసుకుని కొట్టుకున్నారు. పదుల సంఖ్యలో ఇరువర్గాలు చేతికందిన వస్తువులు, కర్రలతో పరస్పరం విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఘర్షణలో పలువురికి గాయలైనట్లు సమాచారం. కాగా పచ్చ కుట్రలతో ఒకే కాలనీలో ఎంతో ఆప్యా యంగా కలిసి మెలిసి జీవించే కుటుంబాల మధ్య గ్రామ టీడీపీ నాయకులు చిచ్చు పెట్టార ని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.


