రుద్రవరం: మండలంలో సోమవారం ఉదయం కురిసిన వర్షానికి వాగులు వంకల్లో నీరు పారింది. మొలక దశలో ఉన్న మినుము, మొక్కజొన్న పైర్లు నీట మునిగాయి. నీరు నిల్వ ఉండటంతో పైర్లు దెబ్బతినకుండా రైతులు వాటిని బయటకు పంపే చర్యలు చేపట్టారు. అలాగే రహదారులు, బయలు ప్రదేశాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోవడంతో రైతులు వాటిని ఆరబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. నిన్న, మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు ఎండలతో పంటలు దెబ్బతినగా ఇప్పుడు వర్షం కురిసి మొలక దశ పంటలను దెబ్బతీసిందని, అలాగే అరకొరగా వచ్చిన మొక్కజొన్న దిగుబడులను తడిపి నష్ట పరిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, నర్సాపురం, ముత్తలూరు, హరినగరం, సుగాలి తాండ, టీ.లింగందిన్నె తదితర గ్రామాల పరిధిలో వర్షం కురిసింది.


