గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

చిప్పగిరి: మండలంలోని బంటణహాలు గ్రామ సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ సీవీ నరసింహులు తెలిపిన వివరాల మేరకు.. బంటణహాలు గ్రామ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలం రంగు గీతల తెల్ల చొక్కా ధరించి ఉన్నాడని, శరీరం పూర్తిగా కుళ్లిపోయి ఉందన్నారు. మృతుడి గురించి వివరాలు తెలిసిన వారు చిప్పగిరి పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

ఫోన్‌ చూడొద్దన్నందుకు తండ్రిపై గొడ్డలితో దాడి

ఆదోని అర్బన్‌: ఎప్పుడూ ఫోన్‌ చూస్తూ గడుపుతున్న కుమారుడిని తండ్రి మందలించడంతో కోపోద్రిక్తుడై గొడ్డలి విసరడంతో తండ్రి కాలికి తీవ్ర గాయమైన ఘటన కౌతాళం మండలం చూడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఘటనపై బాధితుడు మారెప్ప భార్య నరసమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మారెప్ప కుమారుడు వీరేష్‌ (20) సోమవారం పనికి వెళ్లకుండా సెల్‌ఫోన్‌లో రీల్స్‌ చూస్తుండటంతో తండ్రి మందలించాడు. ఈ విషయంలో తండ్రి, కుమారుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన తండ్రి సెల్‌ఫోన్‌ లాక్కొని పగలగొట్టాడు. కోపోద్రిక్తుడైన వీరేష్‌ పక్కనున్న గొడ్డలిని తండ్రిపైకి విసిరాడు. దీంతో మారెప్ప కాలికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న మారెప్పను బంధువులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని భార్య నరసమ్మ తెలిపారు.

వృద్ధుడి ఆత్మహత్య

మద్దికెర: స్థానిక మద్దమ్మ బావి సమీపంలో నివాసముంటున్న ఉప్పర నారాయణ (70) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వృద్ధుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

గడ్డివాములో కొండ చిలువ

మహానంది: మహానందిలో సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం రేపిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మహానందికి చెందిన హనుమన్న ఇంటి పక్కన ఉన్న గడ్డివాములో పెద్ద కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే స్నేక్‌ క్యాచర్‌ మోహన్‌కు సమాచారం అందించారు. మోహన్‌ అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు.

దాడి కేసులో ఏడాది జైలు శిక్ష

కర్నూలు: కర్నూలు నగరం స్వామిరెడ్డి నగర్‌కు చెందిన తిమ్మప్పపై జరిగిన దాడి కేసులో నిందితులకు ఏడాది సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జేఎంఎఫ్‌సీ జడ్జి సంధ్యారాణి తీర్పు చెప్పారు. 2021 డిసెంబర్‌ 13వ తేదీ రాత్రి స్వామిరెడ్డి నగర్‌కు చెందిన తిమ్మప్పపై అదే కాలనీకి చెందిన సందెపోగు శేఖర్‌, షేక్‌ చాంద్‌ బాషా, షేక్‌ మౌలాలి దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. రాళ్లు, కత్తులతో దాడి చేసి గాయపరచినట్లు ఫిర్యాదు చేయగా మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా నేరం రుజువు కావడంతో నిందితులకు సంవత్సరం పాటు సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement