కౌతాళం: వరుణదేవా.. కరుణుంచు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. వర్షాలు లేక రైతన్నలు సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతన్నారు. కొందరు రైతులు ఎలాగైనా పంటలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఖర్చుతో కూడుకున్నా సరే వెనుకుంజ వేయకుండా ముందుకు సాగుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. సాగు చేసిన మిరప పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి మగ్గుతో చెట్లకు పోస్తున్న దృశ్యం బుధవారం మండల పరిధిలోని బదినేహాల్ గ్రామంలో కనిపించింది. రైతు ముత్తమ్మ గారి నాగరాజు మిరప పైరు ఎండకుండా భార్య లక్ష్మితో పాటు కూలీల ద్వారా మొక్కలకు మగ్గుతో నీరు పోస్తున్నారు. తాను రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని ముందస్తుగా ఎకరాకు రూ.35 వేలు చొప్పున చెల్లించి పొలం సాగు చేసినట్లు రైతు తెలిపాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల లేత దశలోనే పంట ఎండిపోతోందని ఇప్పడు కాపాడకపోతే పూర్తి నష్టం జరుగుతుందని చెప్పారు. పంటను కాపాడుకునేందుకు నీళ్ల ట్యాంకర్‌కు బాడుగకు తెచ్చుకుని మొక్కలకు పోస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కౌలుతో పాటు రూ.60 వేల వరకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. మొక్కలకు నీళ్లు పోస్తే పెట్టిన పెట్టుబడైన వస్తుందన్న నమ్మకంతో పని చేస్తున్నట్లు రైతు నాగరాజు చెప్పారు. పంట చేతికొచ్చేటప్పటికి ఎంత ఖర్చవుతుందో అర్థం కావడం లేదని వాపోయారు.


