దేవతతో రాజకీయం | - | Sakshi
Sakshi News home page

దేవతతో రాజకీయం

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

● గ్రామాల్లో టీడీపీ నాయకుల చిచ్చు ● ఏళ్లనాటి సాంప్రదాయానికి స్వస్తి ● ఎవరికి వారే అన్నట్లుగా రెండు గ్రామాల ప్రజలు

● గ్రామాల్లో టీడీపీ నాయకుల చిచ్చు ● ఏళ్లనాటి సాంప్రదాయానికి స్వస్తి ● ఎవరికి వారే అన్నట్లుగా రెండు గ్రామాల ప్రజలు

దేవనకొండ: సోదరుల్లా కలిసిమెలిసి ఉండే రెండు గ్రామాల మధ్య టీడీపీ నాయకులు రేపిన చిచ్చు వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలికింది. ఏకంగా మారెమ్మ దేవతను రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ నాయకులకే చెల్లింది.

గద్దెరాళ్ల మారెమ్మ పుట్టినిల్లు అయిన పల్లెదొడ్డి నుంచి ప్రతి శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి చల్ల సమర్పిస్తే రెండు గ్రామాలు సుఖసంతోషాలతో వర్ధిళ్లుతాయని ప్రజల నమ్మకం. అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది జూన్‌ 5వ తేదీన కూటమి ప్రభుత్వ నాయకులు కొత్తగా ఆలయ కమిటీని ఏర్పరుచుకున్నారు. ఆ కమిటీలో చైర్మన్‌ పదవి మొదలుకుని మెంబర్ల దాకా పల్లెదొడ్డి గ్రామస్తులను ఎవరినీ సంప్రదించకుండా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కనుసన్నల్లో నచ్చిన వారికి పదవులు ఇచ్చుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్లు అయ్యింది.

గద్దెరాళ్ల మారెమ్మ అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది. అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది పల్లెదొడ్డి బోనాలు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గ్రామాన్ని వదిలి ఆలయంతో సంబంధం లేని గ్రామాల్లోని వారికి పదవులు ఇవ్వడంతో పల్లెదొడ్డివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారెమ్మవ్వ ఆలయ కమిటీలో పల్‌దొడ్డి గ్రామవాసులకు ప్రాధాన్యత కల్పించలేదని, అలాంటి చోట తమ ఊరి బోనాలు కూడా అవసరం లేదని, తమ గ్రామంలోనే బోనాల సంబరం జరుపుకుంటామని గ్రామ పెద్దలందరూ తీర్మానించుకున్నారు. వందల సంవత్సరాల సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నా దేవదాయ శాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ శ్రావణమాసం మూడో మంగళవారం అమ్మవారికి చల్లదనం పల్లెదొడ్డి, గద్దెరాళ్ల ప్రజలు ఎవరి ఊళ్లలో వారు జరుపుకున్నారు. అసలే ఒక పక్క వర్షాలు లేక కరువుతో అల్లాడుతుంటే, మరో పక్క గ్రామాల ప్రజలు ఎవరికి వారుగా ఉంటే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే అమ్మవారి దేవరలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement