వేదమూర్తి.. దివ్యదీప్తి | - | Sakshi
Sakshi News home page

వేదమూర్తి.. దివ్యదీప్తి

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

మంత్రాలయం: నింగిన పుష్పవృష్టి.. భువిన భక్తజన సాగరం.. పండితులు వేద ఘోషలు.. కళాకారుల సంప్రదాయ ప్రదర్శనల మధ్య వేదమూర్తి శ్రీరాఘవేంద్ర స్వామి రథోత్సవం సోమవారం కనులపండువగా సాగింది. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో ఉత్సవమూర్తి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులను గురుసార్వభౌమ వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ పాఠశాల విద్యార్థులు వేద పఠనం కానిస్తూ విశేష పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం మూల బృందావనం చేరుకోగా స్వామిజీ ఉత్సవమూర్తి బుగ్గలకు గంధం పూసి వసంతోత్స వానికి శ్రీకారం పలికారు. గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. మంగళవాయిద్యాలు, ఉత్సవ పతాకాలతో ఉత్సవమూర్తితో మహారథం చెంతకు చేరుకున్నారు.

మహారథం చుట్టూ ప్రదక్షిణలు

ఉత్సవమూర్తి మహారథం చేరుకోగా పీఠాధిపతి రథచక్రాలకు నారీకేళాలు సమర్పించి అర్చనలు చేశారు. ఉత్సవమూర్తితో మహారథం చుట్టూ ప్రదక్షిణలు చేశారుస. మహారథంపై కొలువుదీరిన తరుణాన భక్తజనులు గోవిందా.. గోవిందా.. అంటూ ప్రణమిల్లుతూ స్మరణ చేసుకున్నారు. రథంపై ఆశీనులైన స్వామిజీ ప్రవచనం ముగియగానే రథయాత్రకు అంకురార్పణ పలికారు. వంద అడుగుల దూరం చేరుకోగా స్వామిజీ హెలికాప్టర్‌పై నుంచి పుష్ప వృష్టి కురిపించారు. మంగళ వాయిద్యాలు, డప్పు దరువులు, రంగుల ఆటల మధ్య మహారథం అలా ముందుకు కదిలింది. మధ్వ కారిడార్‌, ప్రధాన ముఖద్వారం, సుజయీంద్ర కారిడార్‌ మీదుగా రాఘవేంద్ర సర్కిల్‌ చేరుకుంది. అక్కడ స్వామిజీ పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తికి పూజలు చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. మంత్రాలయం పురవీధుల్లో గంటన్నర పాటు రథయాత్ర సాగింది. తిరిగి శ్రీమఠానికి చేరుకుని పూజా మందిరంలో స్వామిజీ మూల, జయ, దిగ్వజయ సంస్థాన పూజ గావించారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ నేతృత్వంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పండిత కేసరి రాజా ఎస్‌. గిరియాచార్‌, శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్‌–1 శ్రీనివాసరావు, మేనేజర్‌–2 వెంకటేష్‌జోషి, మేనేజర్‌–3 శ్రీపతి ఆచార్‌, మేనేజర్‌–4 సురేష్‌ కోనాపూర్‌ పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా

రాఘవేంద్రుల మహారథోత్సవం

హెలికాప్టర్‌తో మహారథంపై పుష్పవృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement