శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
పోలీసులమంటూ బెదిరించి..!
హొళగుంద: పోలీసులమంటూ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధ రైతును బెదిరించి రూ.20 వేలు కొట్టేసిన ఘటన నెరణికి గ్రామంలో చోటు చేసుకుంది. నెరణికి గ్రామానికి చెందిన బోయ కుంటి మంగన్న అనే 75 ఏళ్ల రైతు మూడు రోజుల క్రితం ఆదోనిలో పత్తి అమ్మగా వచ్చిన డబ్బులో కొన్ని అప్పులు తీర్చేశాడు. ఇంకా ఆలూరులో కిరాణ దుకాణం, ఇతర అంగట్లో ఉన్న అప్పు కట్టి మిగిలిన డబ్బుతో సంత చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆలూరు వెళ్లేందుకు ఆటో కోసం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై నిలబడ్డాడు. ఆ సమయంలో బైక్‌పై ఎల్లార్తి వైపు నుంచి ఆలూరు వైపు వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రైతు మంగన్న వద్ద బైక్ నిలిపి ‘తాము పోలీసులమంటూ సెల్‌ఫోన్‌లో వారు పోలీసు డ్రస్సులో ఉన్న ఫొటోలు చూపి ఇక్కడేం చేస్తున్నావంటూ బెదిరించారు. భయపడిన రైతు సంతకు వెళ్తున్నానని, తన వద్ద ఉన్న రూ.20 వేలు వారికి చూపించగా ఆ డబ్బును తీసుకొని దుండగులు బైక్‌పై పరారైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాముకాటుతో రైతు మృతి
బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్ కొత్తపల్లె గ్రామానికి చెందిన గురు మోహన్ (45) అనే రైతు పొలం పనులు చేస్తుండగా పాముకాటుకు గురై మృతి చెందాడు. ఆదివారం పొలం పనులకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బేతంచెర్ల సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య శివలక్ష్మి, కొడుకు చక్రవర్తి, కుమార్తె గీతాంజలి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖరప్ప తెలిపారు.
దేవరగట్టులో టెంకాయల విక్రయానికి వేలం
హొళగుంద: దసరా బన్ని ఉత్సవాల్లో టెంకాయల విక్రయానికి ఆదివారం దేవరగట్టులో వేలం నిర్వహించారు. ఇందులో నెరణికి గ్రామానికి చెందిన కురువ ద్యావణ్ణ రూ.4.55 లక్షలకు పాట పాడి దక్కించుకున్నాడు. ఆలయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఈ వేలాలు జరిగాయి. కాగా 2025లో రూ.4 లక్షలకు పలకగా , ఈ ఏడాది రూ.55 వేలు అధికంగా వచ్చిందని కమిటీ సభ్యులు తెలిపారు.


