● బ్యాంకర్లను ఆదేశించిన
కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా రుణాల విషయంలో బ్యాంకులు మరింత చొరవ చూపాలన్నారు. గృహ నిర్మాణం కోసం కేవలం 12.45 శాతం మాత్రమే రుణాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రుణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రుణాల పంపిణీలో బ్యాంకులు మరింత చొరవ చూపాలన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పశుపోషణ కోసం రుణాలు ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా పీఎం విశ్వకర్మ కింద పెండింగ్‌లో ఉన్న రుణాలు మంజూరు చేయాలన్నారు. పీఎంఈజీపీ కింద కింద రుణ దరఖాస్తుల తిరస్కరణలు అధికంగా ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రవీంద్రబాబు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.మోహన్, నాబార్డ్ డీడీఎం ఎం.సుబ్బారెడ్డి, కెనరా బ్యాంకు ఆర్‌ఎం సుశాంత్ కుమార్, కేడీసీసీబీ సీఈఓ రామాంజనేయులు పాల్గొన్నారు.


