మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో భక్తుల భద్రతే లక్ష్యమని ఎస్పీ విక్రాంత్‌పాటిల్ పేర్కొన్నారు. శనివారం తుంగభద్ర నదీ తీర ప్రాంతాలు, భక్తుల క్యూలైన్లు, శ్రీ మఠంలో సీసీ కెమెరాల పర్యవేక్షణను పరిశీలించారు. ఉత్సవాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలుపుకోవాలన్నారు. భక్తుల దర్శనం సజావుగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని సీఐలు మధుసూదన్‌రావు, దస్తగిరి బాబు, రామాంజులును ఆదేశించారు.
సచివాలయాల్లో ప్రతి రోజూ పీజీఆర్‌ఎస్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహించాలని జిల్లా అధికారి టీవీ భాస్కర్‌నాయుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా పరిషత్‌లోని తన కార్యాలయంలో మండల/అర్బన్ సచివాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో విధులు ముగించుకొని తప్పనిసరిగా పీజీఆర్‌ఎస్‌కు హాజరు కావాలన్నారు. సచివాలయాల్లోని ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే ఫిర్యాదులు వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


